Chandrababu Naidu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసిపి ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉంది. ఏదో ఒక రూపంలో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. అప్పుడప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ.. వై నాట్ 175 నుంచి జస్ట్ 11 సీట్ల పరిమితమైనప్పటికీ వైసీపీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా వస్తున్నప్పటికీ.. నిత్యం బెంగళూరు ప్యాలస్ లో నివాసం ఉంటున్నప్పటికీ.. వైసిపి కార్యకర్తలు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక రూపంలో విమర్శిస్తూనే ఉన్నారు.
జగన్ బెంగళూరులో ఉంటున్నప్పటికీ.. వైసిపి నాయకులు, కార్యకర్తలు మాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పైగా కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాలలో విభిన్నంగా విమర్శలు చేస్తున్నారు. ఒకరకంగా కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా సరే అందులో లోపాలను వెతుకుతున్నారు. అయితే తొలిసారి కూటమి ప్రభుత్వానికి వైసీపీ నుంచి ప్రశంస లభించింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించింది మామూలు వ్యక్తి కాదు.. వైసీపీలో కీలక నాయకుడు
.. గత వైసిపి ప్రభుత్వం లో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు.
సాధారణంగా అంబటి రాంబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వంపై ఒంటి కాలు మీద లేస్తారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారు. అటువంటి ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఒకరకంగా పరోక్షంగా చంద్రబాబు పరిపాలిస్తున్న విధానాన్ని అభినందించారు.. ఇంతకు ఆయన ఏ విషయంలో చంద్రబాబును అభినందించారంటే.. ఇటీవల రాంబాబు తిరుమల వెళ్లారు. తిరుమలలోని వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో ఆయన భోజనం చేశారు.. భోజనం చేసిన తర్వాత అందులో అన్నప్రసాదాలు బాగున్నాయని ప్రశంసించారు. ప్రసాదం లో రుచి బాగుందని.. నాణ్యత కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అక్కడ భోజనం చేసిన తర్వాత సంతృప్తి పొందినట్టు రాంబాబు తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు.. దేవస్థానం నాణ్యమైన అన్నప్రసాదాలను భక్తులకు అందిస్తోందని పేర్కొన్నారు.. భోజనశాల అత్యంత శుభ్రంగా ఉందని.. రోజుకు 90,000 మందికి భోజనాన్ని ఎలా అందిస్తున్నారో అర్థం కావడం లేదని.. అయినప్పటికీ ఎంత శుభ్రతను ఎలా నిర్వహిస్తున్నారో అర్థం కావడంలేదని రాంబాబు పేర్కొన్నారు.
ఇటీవల వైకుంఠ ఏకాదశి టికెట్లు కేటాయింపులో తిరుమల లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కొంతమంది భక్తులు చనిపోయారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అడ్డగోలుగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఇందులో రాంబాబు కూడా ఉన్నారు. అయితే తొలిసారి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం… తిరుమల తిరుపతి దేవస్థానం పాలక బోర్డు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడం నిజంగా చంద్రబాబుకు ఒక బూస్ట్ ఇచ్చే వార్త లాంటిది. మరి దీనిపై వైసీపీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.. అన్నట్టు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తే అంబటి రాంబాబు ఇలా ప్రశంసిస్తారని కలలో కూడా కూటమి నాయకులు ఊహించి ఉండరు.
