Ambati Rambabu: వాడు ఎక్కడున్నా రాజే రా.. బాహుబలిలో పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ఇప్పుడు అంబటి రాంబాబును ఇలా చెబుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అరెస్టు అయ్యారు. అయితే ఆ కేసులో బెయిల్ వచ్చినా.. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల్లో వసూళ్లపై నమోదైన కేసులో ఇప్పుడు రిమాండ్ పై ఉన్నారు. గత నెల 3న అరెస్టు అయ్యారు అంబటి. అయితే బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కొలిక్కి వస్తుంటే.. కొత్త కేసులు వెంటాడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఉపశమనం లభించింది. అయితే అది బెయిల్ రూపంలో కాదు. జైల్లో వసతుల రూపంలో.
* మిధున్ రెడ్డి మాదిరిగా..
ఇంతకుముందు వివిధ కేసుల్లో అరెస్టయ్యారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఆయన సైతం చాలా రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అప్పట్లో కూడా ఆయన జైల్లో వసతులపై పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొన్ని రకాల అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు అంబటి రాంబాబు సైతం అదే తరహాలో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనం కల్పించాలని.. జైలు లో ప్రత్యేక మంచం వేయాలని.. మందులతో పాటు వైద్య పర్యవేక్షణ కల్పించాలని కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరిస్తూ అన్ని రకాల వసతులను కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు బెయిల్, కస్టడీ పిటిషన్ల పై తీర్పును ఈనెల 18 కి వాయిదా వేసింది.
* పుష్ప డైలాగుతో..
అయితే మొన్ననే అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించారన్న కేసులో ఆయనకు ముందుగా బెయిల్ వచ్చింది. కానీ తరువాత పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మరోసారి బెయిల్ లభించింది. అయితే సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలకు వసూళ్లకు పాల్పడ్డారంటూ మళ్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తగ్గేదే అంటూ పుష్ప డైలాగ్ తో రెచ్చిపోయారు అంబటి. అంతకుముందు చంద్రబాబుపై అసభ్య పదజాలంతో తిట్టినందుకు పశ్చాత్తాప పడ్డారన్న వార్తలు వచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదని అంబటి హావభావాలతో తేల్చేశారు. ఒకవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే.. మరోవైపు జైల్లో వసతులు పెంచుకున్నారు అంబటి రాంబాబు. అందుకే ఆయనను ఉద్దేశించి వైసీపీ శ్రేణులు.. అంబటి రాంబాబు ఎక్కడున్నా రాజే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.