Amaravati Republic Day: అమరావతి రాజధాని( Amravati capital) లో ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతి రాజధాని ఎంపిక తర్వాత స్వాతంత్ర దినోత్సవం తో పాటు గణతంత్ర దినోత్సవం జరగలేదు. మొన్నటికి మొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతారని అంతా భావించారు. కానీ జరగలేదు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవ దిగ్విజయంగా పూర్తి కావడంతో అమరావతి ఒక కొత్త శోభతో వెలిగిపోయింది. హైకోర్టు సమీపంలోని విశాలమైన మైదానంలో జాతీయ పతాకం రెపరెపలాడింది. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం గగనమంత ఎత్తున వినిపించింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెనాయుడు, నారాయణ తదితర కీలక నేతలు హాజరయ్యారు.
గతంలో ఎన్నడూ లేదు
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అందరి ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు అప్పటి సీఎం చంద్రబాబు( CM Chandrababu). అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇంతలో అధికార మార్పిడి జరగడం.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది. దీంతో అమరావతిలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ జరగలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల అధికారిక కార్యక్రమాలను అమరావతి వేదికగా నిర్వహించింది. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు, కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని సైతం నిర్వహించింది. ఇప్పుడు రిపబ్లిక్ డే వేడుకలను జరిపించడం ద్వారా అమరావతి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించగలిగింది.
రైతులకు ప్రత్యేక ఆహ్వానం..
అమరావతిలో జరిగిన గణతంత్ర వేడుకలకు( Republic Day) ముఖ్య అతిథులుగా రైతులకు ఆహ్వానం అందించింది ప్రభుత్వం. వేలాదిమంది అమరావతి రైతుల హర్షద్వానాల నడుమ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తమ భూమిలో రాజధాని వైభవాన్ని కళ్లారా చూడడంతో వారిలో భావోద్వేగం కనిపించింది. విద్యార్థుల కేరింతలతో ఆ మైదానం మార్మోగింది. ఇంతవరకు అమరావతిలో ఇటువంటి కార్యక్రమ నిర్వహణ లేదు. గత కొంతకాలంగా అమరావతి విషయంలో నెలకొన్న అనిశ్చితి.. ఈ అధికారికంగా గణతంత్ర వేడుకలు నిర్వహించడం ద్వారా.. ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి తమనిబద్ధతను చాటుకుంది. అమరావతి ఏపీ రాజధాని అనే స్పష్టమైన సందేశాన్ని ఈ వేదిక ద్వారా ప్రజలకు, పెట్టుబడిదారులకు పంపినట్లు అయ్యింది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇదే విషయంపై తాజాగా ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు కొన్ని కీలక సూచనలు చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించిన మరుక్షణం వేడుకగా కార్యక్రమాల నిర్వహణకు సిద్ధపడుతోంది ఏపీ ప్రభుత్వం. అదే జరిగితే వైసిపి ఇకనుంచి అమరావతి పై మాట్లాడడం శుద్ధ దండగ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.