Amaravati capital : అమరావతి రాజధాని( Amravati capital ) విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. గత అనుభవాల దృష్ట్యా కేంద్రం నోటిఫై చేసేలా.. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. వస్తున్న పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లలో రాజధాని కొలిక్కి తీసుకొస్తామని ఢిల్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం రోజంతా కేంద్ర మంత్రులతో భేటీలు జరిపారు. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ కీలక ప్రతిపాదన చేశారు.
* అందరి అభిప్రాయంతో..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం( Telugu Desam). అందరి అభిప్రాయంతో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు అప్పటి సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ తో శంకుస్థాపన చేయించారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో కొంతవరకు జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే అప్పట్లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. దీంతో అమరావతి రాజధానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలన్న ప్రయత్నం నిలిచిపోయింది. ఈ ఒకే ఒక్క కారణంతో 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానిని నోటిఫై చేసేలా పార్లమెంట్లో చట్టం తీసుకుని వచ్చి ఉంటే.. అమరావతి రాజధానికి ఈ పరిస్థితి ఉండేది కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో దక్షిణ అమెరికా అప్రమత్తం
* అమరావతికి కొత్త కళ
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. టెండర్లను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా ప్రారంభించాలని భావిస్తోంది. ఇటువంటి క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అమరావతిపై విషం చిమ్ముతూనే ఉంది. సాక్షాత్తు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అమరావతికి అంతా ఖర్చు అవసరమా అని కొత్త పల్లవి అందుకున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య 500 ఎకరాల్లో భవనాలు కడితే సరిపోతుందని తేల్చేశారు. తద్వారా అమరావతి రాజధాని విషయంలో తాము సానుకూలంగా లేమన్న సంకేతాలు పంపారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధాని కదిలించలేని స్థితిలోకి తేవాలని భావిస్తున్నారు.
* కేంద్రం సానుకూలం..
ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి రాజధానిని నోటిఫై చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానం వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబు వెళ్లి విజ్ఞప్తి చేయడంతో.. కేంద్ర పెద్దలు దీనిపై ఒక నిర్ణయానికి రానున్నారు. తప్పకుండా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇది ఆమోద ముద్ర వేసుకోనుంది. అదే జరిగితే ఇంకా అమరావతి రాజధానిని కదిలించడం ఎవరితరం కాదు.