Amaravati: ఏపీ ప్రభుత్వానికి( AP government) గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో భారీగా నిధులు కేటాయించింది. దాదాపు రూ.4285 కోట్లు విడుదల చేయడం శుభపరిణామం. ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కూటమి సర్కార్ నిర్ణయించింది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే కేంద్రం నిధులు మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే వార్షిక బడ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా తొలి విడత నిధులను రిలీజ్ చేసింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో ఇది మంచి పరిణామమే.
Also Read: పిల్లలను కనండి.. బాబు కోరిక వైరల్!
* కూటమి వచ్చిన తర్వాత కదలిక..
కూటమి ( Alliance )అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. వాటి నిర్మాణ పనులను యధాస్థితికి తీసుకొచ్చింది. ఇంకోవైపు నిధుల సమీకరణ కూడా చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఆ నిధులను ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పలుమార్లు అమరావతిని సందర్శించారు. చివరకు జనవరి 26న నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి మొదటి విడత నిధులు కూడా కేటాయించారు. కాకా ఈ రెండు బ్యాంకులు కలిపి 13,500 కోట్ల రూపాయల వరకు సమకూర్చేందుకు నిర్ణయించాయి. మిగతా 1500 కోట్ల రూపాయలను కేంద్రమే స్వయంగా సమకూర్చనుంది.
* మొదటి విడత నిధులు విడుదల..
అయితే ఆ రెండు బ్యాంకులు సమకూర్చిన నిధులకు సంబంధించి మొదటి విడత రూ. 4285 కోట్ల నిధులను ఈరోజు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేశాయి. మిగతా మొత్తాన్ని కూడా విడతల వారీగా ఆ రెండు బ్యాంకులు సమకూర్చుతాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం 1500 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వపరంగా చాలా రకాల ప్రాజెక్టులను అమరావతికి కేటాయించింది కేంద్రం. రైల్వే తో పాటు రవాణా ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది కేంద్రం. ఒకవైపు నిధుల ప్రోత్సాహం.. మరోవైపు నైతికంగా మద్దతు తెలుపుతుండడంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
* చివరి వారంలో పునర్నిర్మాణ పనులు..
ఈ నెల చివరి వారంలో అమరావతి రాజధాని( Amaravathi capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పనులు శ్రీకారం చుట్ట నున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. గతానికి భిన్నంగా కేంద్రం సైతం అమరావతి విషయంలో చురుగ్గా స్పందిస్తుండడంతో.. ప్రధాని నరేంద్ర మోడీ మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. మరి అవి ఎలా ఉండబోతున్నాయో చూడాలి.