Amaravati Capital Legal Status: అమరావతికి( Amravati capital ) చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలపడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ఎన్నో పోరాటాల ఫలితంగా అమరావతి సజీవంగా నిలిచింది. కూటమి రావడంతో అమరావతి పునర్నిర్మాణం జరిగింది. అయితే అమరావతిని సజీవంగా ఉంచడంలో ఒక నేత పాత్ర ఉంది. ఎన్నెన్నో అవమానాలను తట్టుకొని ఆ నేత నిలబడటం తోనే అమరావతి ఈ స్థాయికి వచ్చి చేరింది. ఆయనే మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఆమోదం తెలపడం పై షరీఫ్ స్పందించారు. ఆనందం వ్యక్తం చేశారు. అయితే గతంలో ఏపీ శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన అరాచక పర్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లోనే కలకలం రేపుతోంది.
* పాలన వికేంద్రీకరణ బిల్లుతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. నాడు పాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టింది వైసిపి ప్రభుత్వం. శాసనసభలో ఏకపక్షంగా బలం ఉండడంతో ఆమోదం లభించింది. కానీ శాసనమండలిలో మాత్రం బిల్లు పాస్ కాలేదు. 2020 జనవరి 22న ఈ బిల్లు శాసనమండలికి రాగా.. అమరావతిని రాజధానిగా కాపాడుకోవాలన్న విపక్షాల డిమాండ్ ను గౌరవిస్తూ అప్పటి చైర్మన్ షరీఫ్ తన విచక్షణాధికారంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనిని తట్టుకోలేకపోయిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు సభలోని అరాచకం సృష్టించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. నానా దుర్భాషలు ఆడారు. ఆయనను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా భౌతిక దాడులకు దిగారు. షరీఫ్ పై చేయి చేసుకున్నారు..
* శాసనమండలిని రద్దు చేయాలని..
అప్పట్లో అన్ని రకాల బిల్లులు తిరస్కరణకు గురయ్యేసరికి శాసనమండలిని రద్దు చేయాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. కానీ అక్కడ అడ్డంకులు ఏర్పడడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కానీ చైర్మన్ షరీఫ్ ను మానసికంగా వేధించడమే కాకుండా.. సభ నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. రాజధాని రైతుల పక్షాన నిలబడిన అందుకు ఒక ముస్లిం మైనారిటీ నాయకుడిని అవమానించడం ద్వారా.. వైసిపి తాను ఎంచుకున్న మార్గాన్ని బయట పెట్టుకుంది. అయితే రాజకీయంగా ప్రలోభాల పర్వం, ఆ పై దాడులు జరిగిన క్రమంలో షరీఫ్ ధైర్యంగా నిలబడడమే అమరావతి నేటి పరిస్థితికి కారణం. అప్పట్లో ఒత్తిడికి గురై ఉంటే అమరావతి సజీవంగా ఉండకపోయేదేమో…
