Amaravati capital : అమరావతి రాజధాని( Amaravati capital ) నిర్మాణం విషయంలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది. గత పది నెలలు వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం సైతం సాయం చేయడంతో.. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అగ్నిపరీక్ష ఎదురైంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పంపింది కూటమి ప్రభుత్వం. దీంతో కార్యక్రమానికి హాజరు కావాలా? గైర్హాజరు కావాలా? పార్టీ ప్రతినిధులను పంపించాలా? అన్నది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. కార్యక్రమానికి హాజరైతే ఒకలా.. హాజరు కాకుంటే మరోలా.. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు.
Also Read : అమరావతి 2.0.. ప్రధానికి స్వాగతం పలికేది వారే!
* అప్పుడు కూడా గైర్హాజరు..
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన పూర్తి చేసింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు.ప్రతిపక్ష నేతగా నాడు కూటమి ప్రభుత్వం గౌరవించి ప్రత్యేక ఆహ్వానం పంపింది. అప్పటి క్యాబినెట్ మంత్రి రావెల కిషోర్ బాబు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. అయితే నాడు జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. అటు తరువాత రాజధాని నిర్మాణాలు, టెండర్లపై సంచలన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోతుందని నాటి అధికార టిడిపి ప్రచారం చేసింది. అయితే ప్రజలు దీనిని నమ్మలేదు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.
* ప్రత్యేక ఆహ్వానం అందినా
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )అధికారంలోకి వచ్చిన తర్వాత తీరు మారింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేసింది. అయినా సరే ఉద్యమాన్ని నడిపించారు అమరావతి రైతులు. ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త ఊపిరి వచ్చినట్లు అయింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం పంపింది కూటమి ప్రభుత్వం. అయితే ఈసారి క్యాబినెట్ మంత్రితో కాకుండా.. అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారితో పంపించారు. అయితే కార్యక్రమానికి హాజరు కాకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకే గురువారం తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు.
* ప్రధాన వేదికపై చోటు ఉండదు..
ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైతే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సరైన గౌరవం దక్కదు. ఇప్పటికే ప్రధాన వేదికపై ఆసీనులు అయ్యే 19 మంది ప్రముఖుల పేర్లు ఖరారు చేసింది ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ సీఎస్ విజయానంద్ తదితర ప్రముఖుల కు మాత్రమే ప్రధాన వేదికపై చోటిచ్చారు. మిగతా వారి కి మరోచోట వేదిక కల్పించనున్నారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి వచ్చినా ప్రధాన వేదికపై చోటు ఉండదు. పైగా అమరావతి రాజధానిని వ్యతిరేకించారన్న ముద్ర జగన్ మోహన్ రెడ్డి పై ఉంది. అక్కడకు వస్తే తప్పకుండా అదే అంశం మనసులో వ్యక్తం అవుతుంది. ప్రత్యర్థుల వద్ద చులకన అవుతారు. అందుకే కార్యక్రమానికి గైర్హాజరు కావాలని నిర్ణయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి హాజరుకాకపోతే అది అధికార కూటమికి ప్రచార అస్త్రంగా మార్చుకోనుంది. ఇప్పటికీ అమరావతి రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డికి కంటగింపు అని ప్రచారం చేయనుంది. ఇలా ఎలా చూసుకున్నా అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డికి అగ్నిపరీక్ష గా మిగలనుంది.