Amanchi Krishna Mohan: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా ది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇక్కడ రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మిగతా జిల్లాలకు ఈ జిల్లా విరుద్ధంగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం రెండు స్థానాలను టిడిపికి ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో సైతం ఈ జిల్లాలో రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఎక్కువగా ఇండిపెండెంట్ లు గెలిచిన జిల్లాగా కూడా గుర్తింపు ఉంది. ఇక్కడ పార్టీలతో పాటు నేతలకు సైతం ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. అటువంటి వారిలో ఆమంచి కృష్ణమోహన్ ఒకరు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ యాక్టివ్ గా లేరు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. ప్రకాశం జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్లు టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా ఓ టిడిపి ఎమ్మెల్యే ఆయనను కలిశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆమంచి కృష్ణమోహన్ ను కలిసి చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం మొదలైంది.
* చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన జగన్..
మొన్నటి ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేశారు. చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సొంతం చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్లు దక్కించుకుంది ఆమంచి కృష్ణమోహన్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే ఒకానొక దశలో ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది కానీ.. కూటమి పార్టీల నుంచి సానుకూలత రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇంతలో టిడిపి ఎమ్మెల్యే చర్చలు జరపడం మాత్రం కొత్త ప్రచారం మొదలైంది.
* రోశయ్య ప్రోత్సాహంతో..
2009లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ప్రోత్సాహంతో చీరాల టికెట్ దక్కించుకున్నారు ఆమంచి కృష్ణమోహన్. ఒక సాధారణ జడ్పిటిసి గా ఉన్న ఆయన ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట అడుగులు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు ఆమంచి కృష్ణమోహన్. అలా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు కరణం బలరాం చేతిలో. అయితే టిడిపి నుంచి గెలిచిన బలరాం కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో చీరాలలో కరణం వర్సెస్ ఆమంచి అన్నట్టు పరిస్థితి మారింది. చివరకు జగన్మోహన్ రెడ్డి కరణం బలరాం వైపు మొగ్గు చూపారు. ఆయన కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పారు ఆమంచి కృష్ణమోహన్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ టిడిపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే నిన్నటి వరకు వైసిపి అని ప్రచారం జరిగింది. కానీ టిడిపి వైపు వెళ్లి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమంచి చూస్తున్నారు. మరి టిడిపి హై కమాండ్ ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చిందో చూడాలి.