BJP And TDP Alliance: ఇదిగో, అదిగో.. రేపు, మాపు.. ఇలా సాగిపోయింది టిడిపి, జనసేన, బిజెపి కూటమి పొత్తు పరిస్థితి. మొత్తానికి అనేక చర్చల తర్వాత.. అనేక కసరత్తుల తర్వాత.. శుక్రవారం పొత్తు పొడిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరికి ఎన్ని సీట్లు? ఎక్కడినుంచి పోటీ చేస్తారు? ఎవరికి టికెట్ ఇస్తారు? ఇందులో సామాజిక లెక్కలు ఎలా? .. వీటిపై ఇంకా క్లారిటీ రాలేదు.. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ, ఏడు పార్లమెంటు స్థానాలు అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టిడిపి మాత్రం ఆరు అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఓ వర్గం మీడియా చెబుతోంది.. ఎందుకంటే చంద్రబాబు సంకేతాలు లేకుండా ఆ మీడియా అలా రాయదు. కాబట్టి దాదాపు అదే ఓకే అనుకోవాలి. ఇక జనసేనకు 24, బిజెపికి ఆరు మొత్తం 30 స్థానాల మించి మిత్రపక్షలకు ఇవ్వకూడదనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక్కడ చంద్రబాబు అసలు లెక్కలు, దాని వెనుక ఉన్న వ్యూహాలు వేరే ఉన్నాయి. బిజెపికి ఆరు లేదా ఏడు అసెంబ్లీ, నాలుగు లేదా 5 పార్లమెంటు స్థానాలు ఇచ్చినప్పటికీ.. వాటిల్లో తన వాళ్లతోనే పోటీ చేయించాలని నమ్మకంతోనే చంద్రబాబు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..
ప్రస్తుతానికయితే..
ప్రస్తుతం బిజెపిలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, వరదాపురం సూరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ఉన్నారు. వీరంతా ఒకప్పటి టిడిపి నాయకులు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు, వరదాపురం సూరికి ధర్మవరం, కామినేని శ్రీనివాసరావుకు కైకలూరు, విష్ణుకుమార్ రాజుకు విశాఖ నార్త్ టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక బిజెపి సీనియర్ నాయకులు సోమ వీర్రాజు, మాధవ్ కు టికెట్లు ఇచ్చినప్పటికీ.. వారిని కావాలనే ఓడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పార్లమెంటు స్థానాల విషయానికొస్తే సుజానా చౌదరి, సత్య కుమార్, సీఎం రమేష్, దగ్గుబాటి పురందేశ్వరి, టీజీ వెంకటేష్ కు కచ్చితంగా టికెట్లు దక్కుతాయి. వీరిలో పురందేశ్వరి మినహా మిగతా వారందరితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. జివిఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటివాళ్ళకు పార్లమెంటు టికెట్లు కనుక ఇస్తే, కచ్చితంగా టిడిపి నాయకులు పనికట్టుకుని ఓడిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఎంతమంది ఉన్నారనేదే ముఖ్యం
తెర వెనుక ఇన్ని లెక్కలు ఉన్నాయి కాబట్టే బీజేపీ పొత్తు “ఆ విధంగా ముందుకు వెళ్తోంది” అన్నట్టుగా ఓ వర్గం మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. “ఎన్ని సీట్లు బిజెపికి ఇస్తామనేది ముఖ్యం కాదు. ఇచ్చిన ఎన్ని సీట్లలో టిడిపి నేతలు ఉంటారనేదే ముఖ్యం. అలా చూసుకునే చంద్రబాబు టికెట్లు ఇస్తుంటారు. పేరుకు బిజెపితో పొత్తు ఉంటుంది కానీ.. అందులో అసలు కిటుకు వేరే ఉంటుందని” రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ” బిజెపి తరఫున ఎన్నికల్లో పోటీ చేసే 90% మంది నాయకులు టిడిపి నేపథ్యం నుంచి వచ్చిన వారే అయి ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు వారికి మాత్రమే టికెట్లు ఇస్తాడు. ఆ దిశగా బిజెపి అధిష్టానాన్ని ఒప్పిస్తాడు. ఇలాంటి ఒప్పించే రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట” అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.