AP Politics: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పాలన బాగాలేదని.. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెబుతోంది. ఎవరికి వారు తాము చెప్పింది కరెక్ట్ అని భావిస్తున్నారు కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం రెండు పక్షాలకు ఇబ్బందిగానే ఉన్నాయి. అందుకే ఏ మాత్రం అవకాశం వచ్చిన ప్రజల మధ్యకు వెళ్లేందుకు రెండు పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనను మొదలుపెట్టనున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం సైతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేధావులు, తటస్థులతో కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేని సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. టెక్నికల్ గా వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరవుతామని వైసిపి ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. సభలో తగినంత సమయం ఇవ్వనప్పుడు ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నిస్తున్నారు. అందుకే సభకు వెళ్లే కంటే బయట మీడియా ముఖంగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తానని చెబుతున్నారు జగన్. అందుకే వారం వారం ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే సభకు వచ్చి వాయిస్ వినిపించాలని అధికారపక్షం కోరుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి వినడం లేదు. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సభకు వెళ్తున్నారు.
అయితే సభకు రాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారని.. టిఏ,డిఏలు పొందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం వాటిని తీసుకోవడం లేదు. సభకు హాజరు కాని వారు జీతాలు ఎలా తీసుకుంటారు అన్న ప్రశ్న ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. వరుసగా శాసనసభ పని దినాలు 60 రోజుల పాటు సభకు హాజరు కాకుంటే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. దానిపైనే మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలోని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం అయింది. కానీ వారిపై చర్యలు తీసుకోవడం కంటే ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నది ఎథిక్స్ కమిటీ అభిప్రాయం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేధావులు, విద్యావేత్తలతో సమావేశాలు నిర్వహిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంతవరకైనా చలనం వస్తుందని ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయితే.. వెంటనే ఈ సభలకు ప్లాన్ చేస్తోంది ఎథిక్స్ కమిటీ.. ఆపై ప్రభుత్వం. చూడాలి మరి ఏం జరుగుతుందో.