AP Alliance: టిడిపి( Telugu Desam Party) శాశ్వతంగా అధికారంలో ఉంటుంది అని చంద్రబాబు చెబుతున్న మాట వెనుక ఉన్న మర్మం ఏంటి? మరో 15 ఏళ్ల పాటు కూటమి నిరభ్యంతరంగా కొనసాగుతుందని పవన్ చెబుతున్న మాట వెనుక వ్యూహం ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో వరుసగా 15 నుంచి 20 సంవత్సరాలు ఒకే కూటమికి పాలన సాధ్యమా? అసలు ప్రజలు ఛాన్స్ ఇస్తారా? గతంలో ఎప్పుడైనా ఏపీలో ఇటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. 1983కు ముందు ఒకలా.. తరువాత మరోలా ఏపీ రాజకీయాలు నడిచాయి. దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. అయితే టిడిపి ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు ప్రభుత్వాలు వచ్చింది చాలా అరుదు. అలాంటి అవకాశాన్ని దక్కించుకున్నాయి తెలుగుదేశం అండ్ కాంగ్రెస్. 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీతో పాటు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు చంద్రబాబు. 1999లో ప్రజామోదం పొంది రెండోసారి అధికారంలోకి వచ్చారు. 2004లో అధికారంలోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి. 2009లో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో రెండోసారి అధికారంలోకి రాగలిగారు. కానీ అటు తరువాత ఏ ఒక్కరూ, ఏ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.
* ప్రజల్లో సంతృప్తి..
గత అనుభవాలు ఇలా ఉంటే చంద్రబాబుతో( CM Chandrababu) పాటు పవన్ లో ఆ ధీమా ఏంటి అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ప్రజల్లో కూడా కూటమిపాలనపట్ల సంతృప్తి ఉంది. అందుకే కూటమిలో ఆ ధీమా కనిపిస్తోంది. తప్పకుండా చదువుకున్న వారు, విద్యాధికులు, ఏ పార్టీతో సంబంధం లేని తటస్తులు కచ్చితంగా కూటమి వైపు మొగ్గు చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. ఇటువంటి వర్గమంతా ప్రభుత్వాల పనితీరు, రాజకీయ పార్టీల వ్యవహార శైలిని చూసి నిర్ణయం తీసుకుంటాయి. అటువైపే మొగ్గుచూపుతాయి. అయితే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో ముఖ్యంగా పాలన సజావుగా సాగుతోంది. ఈ పరిణామాలతో ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారిలో సంతృప్తి వ్యక్తం అవుతుంది.
* ఈ అంచనాలతో..
మూడు పార్టీల మధ్య పొత్తు కొనసాగితే రాజకీయ సమీకరణలు ఇంచుమించు అలానే ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏడు జిల్లాలు కూటమికి అనుకూలంగా.. మూడు జిల్లాలు వైసీపీకి అనుకూలంగా.. మరో మూడు జిల్లాలు కూటమి, వైసీపీకి సమాన అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణ,గుంటూరు, అనంతపురం జిల్లాలో టిడిపి కూటమికి అనుకూలంగా ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఇక విజయనగరం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు చేరి సగం ఉంటాయి. రాయలసీమలోని కర్నూలు, కడప,చిత్తూరు వైసీపీకి అనుకూలంగా ఉండబోతాయి. బహుశా ఈ అంచనాలతో సైతం చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారు.
* వరుసగా రెండుసార్లు ఓడిపోతే..
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పాలనను ప్రజలు చూశారు. ఆయన వైఫల్యాలను ఇట్టే గమనించారు. ఆయన రాజకీయ మార్గాన్ని వ్యతిరేకించిన వారే అధికం. విపరీతమైన అభిమానులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. అంతకుమించి ద్వేషించిన వారు ఉన్నారు. మరోవైపు సొంత పార్టీలో మరో అవకాశం లేని నేతలు జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఇష్టపడరు కూడా. అలాగే వైసిపి నుంచి వచ్చిన నేతలు సైతం జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఇట్టే చెబుతారు. ఇంకోవైపు మరో రెండు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. అది జరగాలంటే కూటమి కచ్చితంగా కొనసాగాలి. అందుకే చిన్న చిన్న ఇబ్బందులను సైతం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు.