Alla Ramakrishna Reddy next move: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ కోసం శక్తి ధారబోసిన నేతల్లో చాలామంది ఉన్నారు. వారు తమ రాజకీయ ఎదుగుదల కంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలన్న లక్ష్యంతో పనిచేశారు. అటువంటి వారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. అయితే గడిచిన ఎన్నికల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అప్పట్లో జగన్ చుట్టూ ఉన్న కోటరీ నచ్చకపోవడం వల్ల ఆయన బయటకు వెళ్లిపోయారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే మంగళగిరి నియోజకవర్గ నుంచి అతన్ని దూరం చేయడంతో మనస్థాపానికి గురై షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహం వేసారో తెలియదు కానీ.. షర్మిలకు ఒకసారి చెప్పి తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో.. ఆ పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం విశేషం. అయితే ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందా? ఆయన సైతం వైసీపీ నాయకత్వం చెప్పిన విధంగా నడుచుకుంటారా? అనే చర్చ అయితే నడుస్తోంది.
న్యాయ పోరాటం చేయడంలో ముందంజ..
2014లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy) ముందుండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ న్యాయపోరాటం ఆపలేదు. వైసిపి ప్రభుత్వ హయాంలో అయితే.. అసలు నిర్మించని అమరావతి ఇన్నర్ రింగ్రోడ్లో అక్రమాలు జరిగాయంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ మీద కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసును సిఐడి క్లోజ్ చేయాలని కోర్టులో పిటిషన్ వేసింది. అందుకే ఫిర్యాదు దారుగా ఉన్న ఆర్కే కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 27న విజయవాడ కోర్టులో విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈనెల 21న హైదరాబాదులో ఆర్కే కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. అయితే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలా ముందుకు వెళ్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
వేరొకరికి బాధ్యతలు..
2014 ఎన్నికల్లో మంగళగిరి( Mangalagiri) నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే అప్పట్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా సరే ప్రభుత్వంపై న్యాయపోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో ఏకంగా మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను ఓడించి రికార్డు సృష్టించారు. దీంతో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. రకరకాల కారణాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా సరే టిడిపి పై న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే 175 అన్న నినాదంతో మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మొండి చేయి చూపారు. దీంతో మనస్థాపానికి గురైన ఆయన వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఒకటి రెండు రోజులు గడవకముందే మళ్ళీ వైసీపీ గూటికి వచ్చారు. అయితే మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు తనకు ఇస్తారని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దొంతి రెడ్డి వేమారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. సరిగ్గా ఇటువంటి తరుణంలో ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో.. వైసీపీ ఆదేశాలు పాటించి అభ్యంతరాలు తెలుపుతారా? లేకుంటే కేసు వెనక్కి తీసుకోవడానికి సమ్మతిస్తారా అన్నది చూడాలి.