Actor Ali: ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలని హాస్యనటుడు అలీ భావిస్తున్నారు. ఎంపీగా లోక్ సభకు వెళ్లాలని బలంగా ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఎన్నికల ముందే వైసీపీలో చేరడంతో ప్రచారానికే పరిమితమయ్యారు. అయితే అలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంచి పదవి దక్కుతుందని ఆశించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఖాళీల సమయంలో అలీ పేరుబలంగా వినిపించేది. కానీ జగన్ మాత్రం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టు కట్టబెట్టారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పోటీ చేయాలన్న ఆకాంక్షను అలీ తన దగ్గరి వారి వద్ద వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఎంపీగా పోటీ చేసి లోక్ సభలో అడుగు పెట్టాలని అలీ భావిస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. గుంటూరు లోక్ సభ పరిధిలో ముస్లింల సంఖ్య అధికం. అయితే అక్కడ యంగ్ క్రికెటర్ అంబటి రాయుడుకు జగన్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గాలను అలీ అన్వేషిస్తున్నారు. కర్నూలు తో పాటు నంద్యాల పార్లమెంట్ స్థానాల పరిధిలో ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆ రెండిటిలో ఒకచోట పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తానని అలీ ఒక అంచనాకు వచ్చారు. తన మనసులో ఉన్న మాటను వైసిపి పెద్దల చెవిలో వేశారు. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అలీ భావిస్తున్నారు.
ఇటీవల అలీ వైసీపీలో యాక్టివ్ గా మారారు. సామాజిక సాధికార యాత్రలో సైతం పాల్గొంటున్నారు. వైసీపీ సర్కార్ విజయాలను ప్రస్తావిస్తున్నారు. సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అధినేత జగన్ సైతం అలీకి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. అలీ కుమార్తె పెళ్లికి కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తనకు తప్పకుండా జగన్ అవకాశం ఇస్తారని అలీ భావిస్తున్నారు. వైసిపి ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగు పెట్టాలని బలమైన విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగా ప్రచారం జరిగింది. కానీ జగన్ అవకాశం ఇవ్వలేదు. కేవలం ఎలక్షన్ క్యాంపెయినర్ గా మాత్రమే అలీని నియమించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి అప్పగించారు. మరి ఈసారైనా అవకాశం ఇస్తారా? లేదో? చూడాలి.