నంవబర్ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నిబంధనలు, లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పుష్కరాల విషయంలో కఠిన ఆంక్షలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పుష్కర ఘాట్ల దగ్గర పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి జరగకుండా జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
తుంగభద్ర పుష్కరాలకు 12 సంవత్సరాలలోపు పిల్లలకు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అనుమతి లేదని పేర్కొంది. పిల్లలపై, వృద్ధులపై వైరస్ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పుష్కరాలకు వెళ్లే వాళ్లు వయస్సు ధృవీకరణ కోసం ఏదో ఒక గుర్తింపు కార్డును తమ వెంట తీసుకెళ్లాలని.. గుర్తింపు కార్డుతో పాటు ఈపాస్ ఉండాలని పేర్కొన్నారు.
వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుని సులువుగా మెసేజ్ ను పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎవరి దగ్గరైతే మెసేజ్ ఉంటుందో వారిని మాత్రమే పుష్కర ఘాట్ కు అనుమతిస్తామని వెల్లడించారు. పుష్కర ఘాట్ కు ఒకసారి 20 మందిని మాత్రమే అనుమతిస్తామని అనంతరం ఘాట్ ను శానిటైజ్ చేసి మరో బ్యాచ్ ను అనుమతిస్తామని.. మెసేజ్ లేకుండా పుష్కర ఘాట్ కు వస్తే అనుమతించబోమని చెబుతున్నారు.
పుష్కరాలకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు ఈపాస్ నుంచి మెసేజ్ లో పేర్కొన్న సమయంలోనే ప్రజలు పుష్కర ఘాట్ కు రావాల్సి ఉంటుందని.. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.