Homeఆంధ్రప్రదేశ్‌AI Data Center In Vizag: విశాఖలో రూ.87 వేల కోట్ల పెట్టుబడులు.. గూగుల్ కు...

AI Data Center In Vizag: విశాఖలో రూ.87 వేల కోట్ల పెట్టుబడులు.. గూగుల్ కు తలదన్నేలా!

AI Data Center In Vizag: విశాఖకు( Visakhapatnam) ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 16 వేల కోట్లతో సిఫీ సంస్థ డేటా సెంటర్ కాంప్లెక్స్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుంది. తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏఐ పవర్ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపిస్తోంది. దీని ద్వారా ఏఐ టెక్నాలజీతో విశాఖలో వేలాది కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఒక్క గూగుల్ డేటా సెంటర్ రాకతోనే మిగతా సంస్థలు విశాఖపట్నం ఆసక్తి చూపిస్తున్నాయి.

* రెండున్నర ఏళ్లలో మొదటి దశ..
1000 మెగావాట్ల డేటా సెంటర్( data centre) కోసం రైడెన్ సంస్థ రూ. 87,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. రానున్న రెండున్నరేళ్లలో మొదటి దశ యూనిట్ను పూర్తి చేయాలని తమ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వానికి పంపింది. గూగుల్ సంస్థ కూడా విశాఖలో 52 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా నిలవనుంది. మరోవైపు సిఫి సంస్థ డేటా సెంటర్ కాంప్లెక్స్ కు నిర్ణయం తీసుకుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇవి ఫలప్రదం అయ్యేలా ఉన్నాయి.

* మూడు చోట్ల ఏర్పాటు..
రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్( ridden Infotech India Private Limited) విశాఖలో మూడు చోట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లలో 160 ఎకరాలు, అడవివరంలో 10 20 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించి.. రెండున్నర ఏళ్లలోనే మొదటి దశ పనులు పూర్తి చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం. 2026 మార్చి నాటికి నిర్మాణాలు ప్రారంభించి.. 2028 జూలై నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మూడు డేటా సెంటర్లకు దాదాపు 2100 మెగావాట్ల విద్యుత్ అవసరం. విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేయాలని భావిస్తోంది.

* గూగుల్ అనుబంధ సంస్థ..
వాస్తవానికి రైడెన్ అనేది గూగుల్ అనుబంధ సంస్థ. ఇది సింగపూర్ కు చెందినది. స్టాక్ మార్కెట్ లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలో కూడా ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసింది. మొత్తానికి అయితే విశాఖలో వరుసగా ఐటి దిగ్గజ సంస్థల ఏర్పాటు పై ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలకు సంబంధించి ఉత్తరాంధ్ర విద్యార్థులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. కానీ విశాఖ ఐటీ హబ్ గా మారిన క్రమంలో స్థానికంగానే ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎక్కువమంది ఈ పరిణామాలను ఆహ్వానిస్తున్నారు. వీలైనంత త్వరగా ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version