RK Roja : మాజీ మంత్రి రోజా వైసీపీని వీడనున్నారా? ఏపీ రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? తమిళ పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రోజా పెద్దగా కనిపించడం లేదు. వైసిపి కార్యక్రమాలకు వెళ్లడం కూడా తగ్గించేశారు. మొన్న ఆ మధ్యన ఢిల్లీలో జగన్ ధర్నా చేశారు. ఆ ధర్నాలో సైతం రోజా కనిపించలేదు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు రోజా. ఆ తరువాత కూడా మీడియాతో ఆమె మాట్లాడలేదు. గత ఐదేళ్లుగా మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు రోజా. కానీ ఇప్పుడు అధికారానికి దూరమైన తర్వాత ముఖం చాటేశారు. అసలు రాష్ట్రంలోనే కనిపించడం లేదు. చెన్నై వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆమె తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడ ఓ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో సెల్ఫీ దిగే క్రమంలో.. వారికి దూరంగా ఉండిపోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో ఆమె తమిళనాడులో ఉన్నట్లు అందరికీ స్పష్టమైంది. అయితే ఇటీవల విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ వస్త్రధారణతో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియాలో మీమ్స్ నడిచాయి. ఇవి మరువక ముందే మరో వార్త వైరల్ అవుతోంది. ఆమె ఏపీ రాజకీయాలను విడిచిపెట్టి తమిళనాడు వెళ్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా విజయ్ పెట్టబోయే పార్టీలో చేరబోతున్నారన్నది బలమైన ప్రచారంగా ఉంది.
* సుదీర్ఘ నేపథ్యం
రోజా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2009లో నగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఆయన చనిపోయారు. జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వైసీపీకి సైతం భారీ ఓటమి ఎదురుకావడంతో రోజా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.అందుకే తమిళనాడు రాజకీయాల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* ఆ పార్టీలోకి
తమిళ అగ్ర నటుడు విజయ్ జోసెఫ్ కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయడం ఖాయం. రోజా భర్త సెల్వమణి తమిళ దర్శకుడు. ఏపీ రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న రోజాను తమిళనాడు తీసుకెళ్లాలని సెల్వమణి భావిస్తున్నారు. మరోవైపు తమిళ సినిమా రంగంతో పాటు టీవీ ఛానల్ షోల్లో రోజా హోస్ట్ గా వ్యవహరించుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె తమిళనాడు పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
* ప్రాధాన్యమిచ్చిన జగన్
రోజాకు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. తొలి క్యాబినెట్లో ఆమెకు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సమీకరణలో భాగంగా ఆమెకు అవకాశం దక్కలేదు. అందుకే రాష్ట్రస్థాయిలో ఒక పదవి ఇచ్చారు. విస్తరణలో మాత్రం చోటిచ్చారు. ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వరని ప్రచారం జరిగింది. కానీ జగన్ మాత్రం ఆమెను పిలిచి టిక్కెట్ ఇచ్చారు. అయితే గత పదేళ్లుగా రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించిన జగన్ ను కాదని ఆమె ఎక్కడికి వెళ్ళరని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More