Jagan tweet on Vangaveeti Ranga: వంగవీటి మోహన్ రంగా( vangaveeti Mohan Ranga) వర్ధంతి ఈరోజు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సంతాపం తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం సంతాపం తెలిపారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు జగన్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న విమర్శ వచ్చింది. గతంలో తన తండ్రి విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళినందున జగన్మోహన్ రెడ్డి నిలదీసినంత పని చేశారని వంగవీటి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరినప్పుడు రాధా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఐదేళ్ల వైసిపి హయాంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి, జయంతి నాడు జగన్మోహన్ రెడ్డి పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం విశేషం. దీని వెనుక రకరకాల చర్చ నడుస్తోంది.
అప్పట్లో జగన్ నిలదీశారని
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ హయాంలో వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశంలో కొనసాగుతూ వచ్చారు. ఆ సమయంలో రాధాకృష్ణ ఎక్కడికి వెళ్తే అక్కడ కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యేవారు. అయితే ఎంత మాత్రం రాధాకృష్ణ స్నేహంగానే చూసేవారు తప్ప.. రాజకీయ కోణంలో చూడలేదు. అదే సమయంలో టిడిపిలో ఉంటూ విగ్రహ ఆవిష్కరణలకు.. తన తండ్రి వర్ధంతి జయంతి వేడుకలకు ఎవరు పిలిస్తే అక్కడకు వెళ్లేవారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో.. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఓసారి అభ్యంతరం చెప్పారని.. పార్టీ పర్మిషన్ లేకుండా కార్యక్రమాలకు హాజరు కాకూడదని అల్టిమేట్ జారీ చేసినట్లు స్వయంగా వంగవీటి రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ట్వీట్ చేసిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి మాత్రం ఈ రోజు ఉదయమే ట్విట్ చేశారు వంగవీటి మోహన్ రంగ కోసం.
ఆశా కిరణ్ కోసమేనా?
ప్రస్తుతం రాజకీయాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి( Y S Rajasekhara Reddy ). ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటువంటి సమయంలో కాపుల ఆదరణ చూరగొనాలంటే వంగవీటి మోహన్ రంగా పేరు ప్రస్తావించడం అనివార్యం. ఇంకోవైపు వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ సరైన రాజకీయ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఆమెను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నారు జగన్. అందుకే ఈ ట్వీట్ అనే పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.