Vijayawada Floods : వరదతో విజయవాడ నగరం హృదయ విదారకంగా మారింది. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఆస్తి నష్టం జరిగిందని అందరూ అంచనా వేశారు. కానీ ఎవరు ఊహలకు అందనంతగా ప్రాణనష్టం సైతం జరిగినట్లు తెలుస్తోంది. చిట్టి నగర్ ప్రాంతానికి చెందిన ఓ 14 సంవత్సరాల బాలుడు గల్లంతయ్యాడు. ఈరోజు శవమై తేలాడు. దీంతో వరదల్లోనే ఆ మృతదేహాన్ని తరలిస్తున్న తీరు కలచివేసింది. కుటుంబ సభ్యులు ఒక బల్లపై మృతదేహాన్ని పెట్టి తరలిస్తున్నారు. కనీసం ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు బంధుమిత్రులు కూడా లేని పరిస్థితి. ఎవరిని కదిపిన హృదయ విదారక గాథలే అక్కడ కనిపిస్తున్నాయి. తాజాగా ఒక యువకుడి విషాదాంతం వెలుగులోకి వచ్చింది. తాను చనిపోతూ నలుగురిని బతికించాడు. పదుల సంఖ్యలో మూగజీవాలను సైతం కాపాడాడు. ఆ ప్రయత్నంలో తాను బలవన్మరణం చెందాడు.
* విధుల్లో ఉండగా ఒక్కసారిగా
సింగ్ నగర్ ప్రాంతంలో ఒక డైరీ ఫామ్ లో చంద్రశేఖర్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఆయన ఇద్దరు సోదరులు సైతం అక్కడే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో వరదలు చుట్టుముట్టాయి. డైరీ ఫామ్ లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో అక్కడున్నవారు చుట్టుకొకరు పుట్టకొకరుగా మారారు. చంద్రశేఖర్ తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు సహచరులు లోపల ఉండి పోయారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ ఎంతో సాహసం చేశారు. కానీ ఈ క్రమంలో వారిని కాపాడి తాను మాత్రం చనిపోయారు.
* ఒక్కొక్కర్ని కాపాడుతూ
ఒక్కసారిగా వరద రావడంతో అప్రమత్తమైన చంద్రశేఖర్… ఒక్కొక్కరిని షెడ్ పైకి ఎక్కించాడు. అప్పటికే ఆవులు పశువుల శాలలో కట్టేయడంతో వాటిని విడిపించాడు. బయటకు తోలేశాడు. అనంతరం తాను షెడ్ పైకి ఎక్కే క్రమంలో కిందకు పడిపోయాడు. వరదల్లో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఆయన భార్య ఎనిమిది నెలల గర్భిణి. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
* ఒక్కొక్కరిది ఒక్కో గాధ
అయితే వరద బాధిత ప్రాంతాల్లో మృతులది ఒక్కొక్కరిది ఒక్కో గాధ. గల్లంతైన కుమారుడు శవమై తేలడంతో ఒకరు, భార్య గుండెపోటుతో చనిపోవడంతో ఇంకొకరు, కళ్లెదుటే సోదరుడు కొట్టుకుపోవడంతో గుండెలవిసేలా రోదిస్తూ మరొకరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిది దయనీయ గాధ. అందుకే ఎవరిని సముదాయించడం కూడా వీలులేని పరిస్థితి.