Amaravati: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలు, తాజాగా 25 బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అంతకంటే ముందే అమరావతిలో వరద కాలువల నిర్మాణం జరగాలి. వరదను ఎత్తిపోసే పథకాలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే అమరావతి విషయంలో అనవసరంగా జరుగుతున్న ప్రచారానికి, గందరగోళానికి తెరపడేది. ఇప్పటికే ప్రభుత్వం వరద కాలువల నిర్మాణంతో పాటు ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపడుతోంది. వీలైనంత త్వరగా వీటిని నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. అలా పూర్తయిన తర్వాత అమరావతిపై జరిగే ప్రచారానికి పూర్తిగా చెక్ పడనుంది.
* అదనపు భూమి సమీకరణ
మరోవైపు అమరావతికి అదనపు భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఓ 20 వేల ఎకరాలకు పైగా సమీకరించినుంది. అంతర్జాతీయ విమానాశ్రయం తో( International Airport) పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి గాను ఈ భూమి అవసరమని చెబుతోంది. ఒకవైపు అమరావతి రాజధానిలో భారీ నిర్మాణాలను చెబుతున్న ప్రభుత్వం అదే ప్రాంగణంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ఒక విషయం వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయానికి దగ్గరగా భారీ భవంతుల నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారని పౌర విమానయాన శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదే జరిగితే ప్రస్తుతం అమరావతిలో భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. అటువంటి చోట అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఎలా అనేది ఇప్పుడు ప్రశ్న. దానిని నివృత్తి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. ఆపై పౌర విమానయాన శాఖ సైతం కలుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
* అద్భుత రాజధాని టార్గెట్..
అద్భుత రాజధాని కట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. చంద్రబాబు( CM Chandrababu) ప్రణాళిక. అందులో తప్పు కనిపించడం లేదు కానీ.. నిర్ణయాలు పక్కదారి పడితే మాత్రం అదే అంతిమంగా అమరావతికి నష్టం. ప్రత్యక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి నష్టం చేసింది. విలువైన సమయాన్ని వృధా చేసింది. రాజధాని లేని నగరంగా ఏపీ ఉండడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఉంది. దానిని అధిగమించే క్రమంలో ఒకటికి రెండుసార్లు కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అనాలోచిత నిర్ణయాలను పక్కన పెట్టాలి. ముఖ్యంగా భూ సమీకరణ, నిర్మాణాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే చాలా మంచిది. లేకుంటే ఆ ప్రయత్నాలు వికటిస్తాయి. చేటు తెస్తాయి కూడా. అంతర్జాతీయ విమానాశ్రయం కడతామనడంలో తప్పులేదు కానీ.. అది నిబంధనల మేరకు కట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమరావతి విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట పడాల్సి ఉంది. వరద కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తే లేనిపోని ప్రచారానికి చెక్ పడుతుంది. ఆ తరువాత అద్భుత ఆలోచనలతో ముందుకు సాగవచ్చు. ఆచరణ సాధ్యం చేసుకోవచ్చు.