Actor Ali: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో కూర్చోవాలన్నది సినీనటుడు అలీ ధ్యేయం. ఇందుకు చాలాసార్లు ఆయన ప్రయత్నించారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో అలీ కొనసాగారు. ఆ పార్టీ తరఫున చాలాసార్లు ఎన్నికల ప్రచార సభల్లో సైతం పాల్గొన్నారు. గత ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించారు. ఎక్కడా సర్దుబాటు అయ్యే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలో చేరారు. అప్పటికే అక్కడ సీట్ల ప్రకటన పూర్తయింది. దీంతో అలీప్రచారానికి పరిమితం అయ్యారు. 2024 ఎన్నికల్లో ఛాన్స్ దొరుకుతుందని భావించారు. గత ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చింది. చాలా రకాల పెద్ద పదవులకు అలీ పేరు వినిపించినా.. చివరకు చిన్నపాటి పదవితో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. కేవలం ఈ ఎన్నికల్లో అవకాశం దక్కుతోందని అలీ భావించి వైసీపీలో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో కూడా వైసిపి చాన్స్ ఇవ్వకపోవడంతో అలీ ఎలా నడుచుకుంటారో అన్నది చూడాలి.
పవన్ కళ్యాణ్ కు అలీ అత్యంత ఆప్తమిత్రుడు. ఈ విషయాన్ని పవన్ సైతం చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ఆయన జనసేనలో చేరాలి. కానీ అనూహ్యంగా వైసీపీలోకి వెళ్లారు. గత ఎన్నికలకు ముందు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పవన్ సైతం అలీ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఆయన సమీప బంధువుకు జనసేన టికెట్ ఇప్పించుకున్నారని.. తాను మాత్రం వైసీపీలో చేరిపోయారని అప్పట్లో పవన్ సెటైర్లు వేశారు. అలీ కోసం ఎంతో చేస్తే.. ఆయన మాత్రం తనను మోసం చేశాడని అర్థం వచ్చేలా పవన్ మాట్లాడారు. అప్పట్లో దీనిపై అలీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సినిమా పరిశ్రమలో పవన్ కంటే తానే సీనియర్ నని.. స్వయంకృషితో ఎదిగానని.. సినిమాల్లో క్యారెక్టర్ల కోసం ఎవరి వెంట పడలేదని కామెంట్స్ చేశారు.
అయితే గత ఐదు సంవత్సరాలుగా పవన్ ను అలీ కలుసుకోలేదు. కనీసం ఆయన నటించిన సినిమాల్లో కూడా అలీ కనిపించలేదు. దీంతో వారిద్దరి మధ్య గ్యాప్ అమాంతం పెరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వైసీపీలో అలీకి సీటు దక్కకపోవడంతో కొత్త ప్రచారం ప్రారంభమైంది. అలీ జనసేనలో చేరతారనే టాక్ నడుస్తోంది. లేకుంటే రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగు పెట్టాలన్న ఛాన్స్ వైసీపీ ఇస్తుందని అలీ భావించారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తే కెరీర్ పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోనీ టిడిపిలో చేరతామని అనుకున్న అక్కడ ఛాన్స్ దొరికే పరిస్థితి లేదు. పవన్ రూపంలో జనసేన చాన్స్ ఉన్నా.. గతంలో పవన్ ను టార్గెట్ చేసుకోవడం ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుతం కెరీర్ సవ్యంగా ముందుకు సాగుతుండడంతో.. రాజకీయాల నుంచి తప్పుకోవడమే శ్రేయస్కరమని అలీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎక్కడ నోరు తెరవలేదు. బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు. కానీ వైసిపి నుంచి పోటీ చేసే ఛాన్స్ దక్కకపోవడంతో మాత్రం అలీ తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.