ABV Venkateswara Rao: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక పట్టాన అంతు పట్టవు. అప్పటిదాకా శత్రువులుగా ఉన్నవారు మిత్రుల మాదిరిగా మారిపోతారు. మిత్రుల మాదిరిగా ఉన్నవారు కత్తులు నూరుకుంటారు. ఏ సందర్భంలో ఎలా ఉంటారు.. ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తారో తెలియకుండా రాజకీయ నాయకులు పాలిటిక్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి విశ్రాంత అధికారులు కూడా చేరిపోయినట్టు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు వ్యవహార శైలి నిత్యం చిత్రంగానే ఉండేది. నాడు ఆయన ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడేవారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టేవారు. ఒక దశలో ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిపోయారు. జగన్ కు అంటిలో రాయిలాగా అయిపోయారు.
ఏబీవీ ప్రభుత్వ అధికారిగా ఉంటూనే.. ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేయడంతో సహజంగానే నాడు టిడిపి ఆయనలో నెత్తికెక్కించుకుంది. టిడిపి అనుకూల మీడియా ఏబీవీకి విపరీతమైన స్పేస్ ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏబీవీ మల్లి తెరమీదకి వచ్చారు. అయితే ఈసారి ఆయనకు కీలక ప్రాధాన్యం దక్కడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఏబీవీ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించాడో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా ఆయన అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఉపా చట్టం మీద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అంబటి రాంబాబు తో కలిసి ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే వేదిక పంచుకోవడం ఏపీ రాజకీయాలలో చర్చకు దారి తీసింది.
ఏబీవీ తీరు పట్ల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాను ఒకే వేదిక ఎందుకు పంచుకున్నది.. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నది.. అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని ఏబీవీ స్పష్టం చేశారు. సదస్సులో పాల్గొన్నంత మాత్రాన తాను మిగతా రాజకీయ పార్టీలకు అనుకూలం కాదని.. తన ఒపీనియన్ చెప్పానని.. వేదిక పంచుకున్నంత మాత్రాన ఆ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నట్టు కాదని ఏబీవీ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం రెండవ విడతలో వేలాది ఎకరాలు సేకరిస్తున్న తీరును ఏబీవీ తప్పు పట్టారు. గతంలో జగన్ మాదిరిగానే ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తే.. తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఏబీవీ హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం మాట్లాడే హక్కును తొక్కి వేసిందని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలానే చేస్తే ప్రజలు క్షమించాలని ఏబీవీ స్పష్టం చేశారు.
