https://oktelugu.com/

YS Sharmila: ఆర్కే పేల్చిన బాంబ్: ‘జగనన్న బాణం’ ఆయనపైకే

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల ఎటువైపు అడుగులు వేస్తారు? 2019 మాదిరి అన్నకు సపోర్టుగా ఎన్నికల ప్రచారం చేస్తారా? లేక సొంత పార్టీ పెట్టుకున్న కాబట్టి ఏపీలో చక్రం తిప్పుతారా? కాంగ్రెస్ పార్టీలో ఎలాగు విలీనం చేశారు కాబట్టి ఏపీలో సారధ్య బాధ్యతలు వహిస్తారా? అనే చర్చ జరుగుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 27, 2023 / 09:32 AM IST

    YS Sharmila

    Follow us on

    YS Sharmila: అప్పట్లో అంటే తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది అనగా రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడిచింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం అవుతుందని, ఆమె పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆమెకు మంత్రి పదవి కూడా దక్కుతుందని.. అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అవన్నీ తప్పు అనే ప్రచారం కూడా జరిగింది. సీన్ కట్ చేస్తే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగడం.. రేవంత్ రెడ్డి నో చెప్పడం వంటి పరిణామాలతో అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల నుంచి షర్మిల తప్పుకుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది.. చివరికి పాలేరులో తన సోదరుడికి అత్యంత ఆప్తుడైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ప్రకటించి ఆయన గెలుపునకు సహకరించింది. ఈ లోగానే షర్మిల కొడుకు ప్రేమ వ్యవహారం బయటికి రావడం.. చట్నీస్ రెస్టారెంట్ అధినేత ప్రసాద్ మనవరాలితో వివాహం కుదిరిపోవడం అన్ని చక చకా జరిగిపోయాయి. త్వరలో పెళ్లికూడా జరగనుంది.

    అయితే త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల ఎటువైపు అడుగులు వేస్తారు? 2019 మాదిరి అన్నకు సపోర్టుగా ఎన్నికల ప్రచారం చేస్తారా? లేక సొంత పార్టీ పెట్టుకున్న కాబట్టి ఏపీలో చక్రం తిప్పుతారా? కాంగ్రెస్ పార్టీలో ఎలాగు విలీనం చేశారు కాబట్టి ఏపీలో సారధ్య బాధ్యతలు వహిస్తారా? అనే చర్చ జరుగుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాసింది. షర్మిల త్వరలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్నారని ఆ వార్త సారాంశం. సహజంగా ఇలాంటి వార్తను సాక్షి రాయదు. ఈనాడు కు అంత సీన్ లేదు. ఈమధ్య ఎందుకనో షర్మిలకు రాధాకృష్ణ విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నాడు. అన్నకి, చెల్లికి మధ్య జరిగిన గొడవల దగ్గర నుంచి మొదలు పెడితే తాడేపల్లి ప్యాలస్ నుంచి షర్మిల బయటకు వచ్చేంతవరకు ప్రతి విషయం రాధాకృష్ణ తన పత్రికలో రాసుకొచ్చాడు. వాస్తవంగా అతడు చెప్పిన ప్రతి విషయం నిజం కావడంతో.. ఇప్పుడు కూడా అది నిజమయ్యే దాఖలాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అంతగా జవసత్వాలు లేవు. పెద్దపెద్ద నాయకులు మొత్తం తమ రాజకీయ ప్రాపకం కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లారు. అప్పట్లో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో పనిచేసిన రఘువీరారెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో చావు దెబ్బ తిన్నది. సో ఇప్పుడు ఆ పార్టీ కి ఒక బలమైన నాయకుడు కావాలి. శ్రేణుల్లో ధైర్యం నింపే నాయకుడు కావాలి. అయితే ఆ లక్షణాలు షర్మిల లో ఉన్నాయని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించే యొచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తన అన్న జైల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి పార్టీని బతికించింది షర్మిలనే. తన అన్న అధికారంలోకి వచ్చేందుకు కూడా కారణమైంది ఆమెనే. అందుకే ఆమె మీద కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకం పెట్టుకుందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఊపు ఏపీలో కూడా కొనసాగుతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఒకవేళ ఏపీలో గనుక చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను సాధిస్తే అది తదుపరి ఎన్నికలకు ఉపకరిస్తుందని ఆ పార్టీ నాయకుల భావన. ప్రస్తుత ఎన్నికల్లో ఒకవేళ టిడిపికి సీట్లు తక్కువ పడితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో కీలక భాగస్వామి అవ్వచ్చని కూడా ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ జనసేనకు సీట్లు తక్కువ వస్తే ఆ స్థానాన్ని తమ పార్టీ అభ్యర్థులు భర్తీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

    ఇక జగన్ కంటగింపుగా ఉన్నాడు కాబట్టి.. అతడిని అడ్డు తొలగించుకోవాలంటే.. గతంలో అతడు వదిలిన బాణాన్ని అతని మీదకే ప్రయోగించే విధంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని.. రాధాకృష్ణ రాసుకొచ్చాడు. పైగా చంద్రబాబు మనిషి కాబట్టి.. జగన్ లాంటి నాయకుడిని చంద్రబాబు సొంతంగా ఓడించలేడు కాబట్టి.. రాధాకృష్ణ తనకున్న కొద్దిపాటి సమాచారంతో బొంబాట్ పేల్చేశాడు. షర్మిల కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకుంటే అది అంతిమంగా జగన్ కే నష్టం కాబట్టి.. దానివల్ల చంద్రబాబు నాయుడు లబ్ది పొందుతాడు కాబట్టి.. రాధాకృష్ణ షర్మిలను వెనుకేసుకొస్తున్నాడు. ఎలాగూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావాలి అని కంకణం కట్టుకున్నాడు కాబట్టి రాధాకృష్ణ ఏదైనా రాయగలడు. ఇంకేదైనా చేయగలడు. అన్నట్టు ఆమధ్య తెలంగాణలో పార్టీ పెడుతున్నప్పుడు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పిన షర్మిల.. కొంతకాలానికే తెలంగాణలో కాంగ్రెస్ మద్దతు పలికారు. ప్రస్తుతం ఏపీలో సారధ్య బాధ్యతలు వహించబోతున్నట్టు వార్తలు అందుతున్నాయి. మరి దీనిని షర్మిల ఏ విధంగా సమర్థించుకుంటారు? ఆమెను సమర్థిస్తూ ఆంధ్రజ్యోతి ఇలాంటి వార్తలు రాయగలదు? ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.