Aarogyasri services: ఏపీలో( Andhra Pradesh) ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు దిగడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తమకు 2700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి. దీంతో 20 రోజులుగా సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల నెట్వర్క్ ఆసుపత్రుల్లో సగానికి పైగా ఓపీ సేవలతో పాటు అత్యవసర సేవలు సైతం నిలిపివేసాయి. ఆపరేషన్లు జరగకపోవడంతో అత్యవసర రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
కూటమి అధికారంలోకి వచ్చిన నాటికి పెండింగ్
కూటమి ప్రభుత్వం( alliance government ) పాలనపగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2700 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులకు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం కొంత మొత్తం నిధులను విడుదల చేసింది. అటు తరువాత చెల్లింపులు చేస్తూ వస్తోంది. అయితే ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్న బకాయిలు మాత్రం కొనసాగుతూ వచ్చాయి. అందుకే సేవలు నిలిపివేస్తే ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు భావించాయి. గత నెల 10 నుంచి సమ్మెబాట పట్టాయి. కొన్ని ఆసుపత్రులు ఓపి సేవలను నిలిపివేశాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అత్యవసర చికిత్సలు సైతం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఏకకాలంలో బిల్లుల చెల్లింపు..
అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ( aarogya Sri ) ఆపరేషన్లు కొనసాగాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై పని భారం పెరిగింది. చాలామంది ఆపరేషన్లను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. నవంబరు నెలాఖరుకు ఏక మొత్తంలో రూ. 250 కోట్ల నిధులు విడుదలకు అంగీకారం తెలపడంతో.. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరిస్తామని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ముందుకు వచ్చాయి. అయితే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ కి చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ జరిగాయి. తిరిగి ఆపరేషన్లు ప్రారంభం కానున్నాయి.