Allagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గంగమ్మ ఆలయానికి సమీపంలో స్థానికంగా ఉన్న యువకులు మండపాన్ని ఏర్పాటు చేశారు. దానిపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిరోజు ఉత్సాహంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అన్నదానం కూడా చేపట్టారు. రాత్రిపూట భక్తి పాటలు పెట్టుకుంటూ డ్యాన్సులు వేస్తున్నారు. గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఆ ప్రాంత వాసులు కూడా చందాలు ఇవ్వడంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆ మండపంలో ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అశోక్ (32) అకస్మాత్తుగా కన్నుమూశాడు. గణపతి మండపంలో పాటలకు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. గణపతి మండపంలో ఆదివారం రాత్రి భక్తి పాటలు పెట్టారు. ఆ పాటలకు పట్టణంలో పెయింటర్ గా పనిచేస్తున్న అశోక్ అనే యువకుడు లోబో అనే యువకుడితో కలిసి డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. చాలాసేపు వాళ్లు అలాగే డ్యాన్స్ చేశారు. చూస్తున్న వాళ్లు ఈలలు వేయడంతో ఉత్సాహంతో మరింతగా స్టెప్పులు వేశారు. ఇలా చూస్తుండగానే అశోక్ ఒకసారి గా కుప్పకూలిపోయాడు.. దీంతో చుట్టుపక్కల వాళ్ళు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.
గుండె పోటు రావడంతో..
అశోక్ డాన్స్ వేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రత అధికంగా ఉండడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని.. అందువల్లే చనిపోయాడని చెబుతున్నారు.. అశోక్ పెయింటర్ మాత్రమే కాకుండా.. కళాకారుడు కూడా. విచిత్రమైన వేషాలు వేస్తూ స్థానికులను అలరిస్తుంటాడు. పండుగలు, వేడుకల సమయంలో ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం అశోక్ భార్య 7 నెలల గర్భిణి. గణపతి మండపంలో డ్యాన్స్ వేసుకుంటూ తన భర్త చనిపోవడంతో ఆమె కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. ఈ ఘటనపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం అశోక్ మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం అతడి అంత్యక్రియలు పూర్తి చేశారు. అశోక్ అకాల మరణం తో కన్నుమూయడంతో అతని స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు. అశోక్ మృతి నేపథ్యంలో ఆళ్లగడ్డ పెయింటర్స్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. అతడికి నివాళిగా మంగళవారం పెయింట్ పనికి సెలవు ప్రకటించింది. అశోక్ మృతి విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు సంతాపం ప్రకటించారు. అతడి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియలలో ముందు వరుసలో నడిచారు. కాగా, అశోక్ భార్య 7 నెలల గర్భిణి కావడంతో.. ఆమె తన భర్త మృతదేహంపై పడి మా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది.