Macharla : సమాజంలో పరువు హత్యలు చూస్తున్నాం. వేరే సామాజిక వర్గం వారిని ప్రేమించారని కన్నవారే కర్కశంగా హత్యలు చేస్తున్నారు. ప్రేమించిన వారిని దారుణంగా చంపుతున్నారు. పచ్చని జీవితాల్లో చిచ్చు రేపుతున్నారు. అయితే కొందరు పరువు ఆత్మహత్యలకు కూడా కారణమవుతున్నారు. అటువంటి ఘటనే పల్నాడు జిల్లా మాచర్లలో వెలుగు చూసింది. ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కర్నూలు జిల్లాకు చెందిన రేణుక ఎల్లమ్మ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో స్నేహితులు లేని సమయంలో గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆమె మరణానికి ముందు సూసైడ్ నోట్ రాసింది. తన తండ్రి తనని నమ్మలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ నాన్న నువ్వే నన్ను నమ్ముకుంటే ఎలా? నువ్వే నా ధైర్యం.. నేను తప్పు చేశాను అనుకుంటే బతకడం వ్యర్థం’ సాగిన ఈ సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. కేవలం కన్న తండ్రి తనను నమ్మలేదన్న బాధ ఆమెలో పెరిగింది. ఆత్మహత్యకు ప్రేరేపించింది. చిన్న పొరపాటు, సమాచార లోపం నిండు జీవితాన్ని బలితీసుకుంది. కూతురు భవిష్యత్తు ఏమవుతుందోనన్న తండ్రి ఆందోళన.. తండ్రి తనను నమ్మలేదని కూతురు బాధ.. వెరసి ఓ యువతి నిండు ప్రాణం బలిగొంది. ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.కేవలం తొందరపాటు తనం వల్లే ఈ ఘటన జరిగింది. ఓ యువతి మరణానికి కారణమైంది.
* సాధారణ కుటుంబం
కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరీ దంపతులు డోన్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రేణుక ఎల్లమ్మ పల్నాడు జిల్లా మాచర్ల లోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవలే వేసవి సెలవులు ముగించుకుని కాలేజీకి తిరిగి వెళ్ళింది. అక్కడే హాస్టల్లో తన స్నేహితులతో కలిసి ఉంటోంది. ఆదివారం సాయంత్రం ఓ అబ్బాయి రేణుకకు ఫోన్ చేశాడు. రేణుకను సొంత చెల్లెలుగా భావిస్తాడు. రేణుక వేరే పనిలో బిజీగా ఉండి ఫోన్ తీయలేదు. దీంతో ఆ అబ్బాయి రేణుక తండ్రి గౌరప్పకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అయితే నేరుగా అబ్బాయి ఫోన్ చేయడంతో గౌరప్ప ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. రేణుక కు ఫోన్ చేసి మందలించాడు.
* మనస్థాపానికి గురైన రేణుక
అయితే తండ్రి తీవ్రంగా మందలించేసరికి రేణుక తీవ్ర మనస్థాపానికి గురైంది. కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో పనేంటి? అనేసరికి ఒక్కసారిగా ఆవేదనకు గురైంది. సోమవారం కాలేజీకి వచ్చి మాట్లాడతానని తండ్రి చెప్పడంతో ఆందోళనకు గురైంది. రేణుక ఎంత చెప్పినా తండ్రి మాత్రం వినిపించుకోలేదు. తండ్రి నేరుగా కాలేజీకి వస్తే పరువు పోతుందని భావించింది. తన మరణంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని క్షణికావేశానికి లోన్ అయింది. తాను ఏ తప్పు చేయలేదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
* ఆసక్తికర విషయాలు వెలుగులోకి
అయితే సూసైడ్ నోట్ లో తన ఆవేదనను వ్యక్తపరిచింది రేణుక. ‘ నాన్న నేను ఏ తప్పు చేయలేదు. నీ పరువు తీసే పనిని ఏరోజు చెయ్యను. ఒకవేళ నేను తప్పు చేశానని అనుకుంటే నువ్వు నా చదువు ఆపినా నేను బతకను. నాన్న నువ్వే నా ధైర్యం, నువ్వే నమ్మకుంటే.. ఎవరు నమ్ముతారు. నాన్న నేను తప్పు చేశానని అనుకుంటే బతకడం వ్యర్థం. నీతో మాట్లాడిన అన్న తప్పులేదు. నన్ను అమ్మలా భావిస్తాడు’ అంటూ రేణుక రాసిన ఆత్మహత్య లేఖ ఇప్పుడు కన్నవారిని దహించేసింది. అనుమానించి చేజేతులా కుమార్తెను పోగొట్టుకున్నామంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More