Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు సమీపిస్తోంది. టిడిపి కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. 164 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చింది. వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ఓటమి తప్పలేదు. అయితే ఘోర పరాజయం చవిచూడడంతో వైసిపి ప్రభుత్వం వైఫల్యాలపై రకరకాల విశ్లేషణలు జరిగాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుతోనే ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైందన్న విశ్లేషణ ఉంది. ఏడు పదుల వయసులో ఉన్న నేతను అక్రమంగా అరెస్టు చేశారని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇదే తమకు ఓటమి తెచ్చిపెట్టిందని వైసిపి నాయకులు బలంగా నమ్ముతున్నారు. తొలి నాలుగు సంవత్సరాల వరకు వైసీపీ ప్రభుత్వం పై సానుకూలత ఉన్నా..చివరి ఏడాది మాత్రం భారీ వ్యతిరేకతతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ ప్రధానంగా మాత్రం చంద్రబాబును అరెస్టు చేయడం వైసీపీకి మైనస్ అయ్యింది. టిడిపికి సానుభూతి పని చేసింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఏడాది తిరిగేసరికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
* ఆ రోజు ఏం జరిగిందంటే
2023 సెప్టెంబర్ 8న నంద్యాల పర్యటనకు చంద్రబాబు వెళ్లారు. ఆ రాత్రి అక్కడే బస్సులో బస చేశారు.ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించి అవకతవకలు జరిగాయని అభియోగాలు మోపుతూ చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేశారు. వందలాదిమంది పోలీసులతో బస్సును చుట్టుముట్టి వీరంగం సృష్టించారు.అవసరమైతే బస్సు తలుపులను బద్దలు కొడతామని కూడా హెచ్చరించారు. చివరకు ఉదయం ఆరు గంటల సమయంలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు.
* అనేక కేసులు మోపుతూ
ఒక్క స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుతో ఆగలేదు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు,మద్యం పాలసీ,ఇసుక.. ఇలా చాలా రకాల అభియోగాలు మోపారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండి పోవాల్సి వచ్చింది. ఆయనకు బెయిల్ సైతం లభించలేదు. అలా పట్టు బిగిస్తూ వచ్చింది జగన్ ప్రభుత్వం.కనీసం ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేయడం.. ఉద్దేశపూర్వకంగా బెయిల్ రాకుండా చేయడం వంటి కారణాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అవే సానుభూతికి కారణమయ్యాయి.
* ఆ ఒక్క ఘటనతోనే
తొలి నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబును జగన్ టచ్ చేయలేదు.అంతవరకు పరిస్థితి అదుపులోనే ఉంది.సంక్షేమ పథకాలు అందించడంతో ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే చంద్రబాబును అరెస్టు చేయడం, దానిని విపక్షం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో జగన్ కు నష్టం జరిగింది. అదే సమయంలో టిడిపి తో జనసేన ను దగ్గర చేసేందుకు దోహద పడింది. బిజెపి పెద్దలను ఆలోచింపజేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే పొత్తుకు ప్రధాన భూమిక పోషించింది చంద్రబాబు అరెస్ట్. చంద్రబాబు అరెస్టుతోనే జగన్ పతనం ప్రారంభమైంది.