Prathipadu: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ వేడి ఉంది. నేతలంతా ప్రచార పర్వంలో ఉన్నారు. కీలక నేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలో ఏపీ మహిళ ఒకరు ఢిల్లీలో కలకలం సృష్టించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఏకలవ్యుడు తరహాలో తన చేతి వేలిని నరుక్కొని కలకలం రేపారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆ ఘటనపై పడింది. అందరూ ఆరా తీయడం ప్రారంభించారు.
ఏపీలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలపై కోపూరు లక్ష్మి అనే మహిళ గత కొద్ది రోజులుగా పోరాడుతున్నారు. ఆమె ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. మాజీ హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఓ ముఠా ఆగడాలపై పోరాడుతున్నారు. చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేయడం, వారితో విక్రయించడం, నేరప్రవృత్తి పెంపొందిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోరాడే క్రమంలో అధికారుల నుంచి బ్లాక్ మెయిలింగ్ లను ఎదుర్కొన్నారు. ఆమెపైనే తిరిగి తప్పుడు ప్రకటనలు చేశారు. సుచరిత అనుచరుల భూకబ్జాలు, అవినీతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని, రాష్ట్రపతి, మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసేందుకు రెండు రోజుల కిందట లక్ష్మీ ఢిల్లీ చేరుకున్నారు. అయితే వారిని కలిసేందుకు అవకాశం దొరకక పోవడంతో.. ఆయా కార్యాలయాల్లో ఫిర్యాదులు కూడా అందించారు. అటు తరువాత ఇండియా గేట్ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్తాపంతో తన ఎడమ చేతి బొటన వేలును నరుక్కున్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలు ప్రపంచం దృష్టికి తీసుకు రావడం కోసమే ఈ పని చేయాల్సి వచ్చిందని లక్ష్మీ చెబుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్రపతి స్పందించి ఏపీ పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఏపీలో జరుగుతున్నా అరాచకాలపై ఓ మహిళ ఇలా.. చేతి వేలిని నరుక్కోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.