Dead body door delivery case: కాకినాడకు ( Kakinada) చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ఆధారాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీని సెంట్రల్ ఫోరనిక్స్ సైన్స్ లేబరేటరీ కి పంపించి విశ్లేషించగా… అందులో అనంతబాబు కుటుంబ సభ్యులు సైతం కనిపించినట్లు సమాచారం. హత్యకు ముందు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరెవరిని కలిసి ఉంది అనేది కూడా గుర్తించారు. అయితే ప్రధానంగా ఈ కేసులో అనంతబాబు భార్య రోజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెను అరెస్టు చేస్తారని కూడా ప్రచారం నడుస్తోంది. వైసిపి హయాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శ ఉంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
రాజకీయ వివాదం నేపథ్యంలో..
ఇటీవల రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి పై ఎమ్మెల్సీ అనంత బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా దూకుడుగా మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు విచారణ వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య రోజాను విచారణకు పిలిచేందుకు పోలీసులు సన్నాహాలు చేసినట్లు సమాచారం. ఆమె కుల ధ్రువీకరణ కోసం అడ్డతీగల తహసిల్దార్ కార్యాలయానికి ఇటీవల విచారణ అధికారి ఒకరు లేఖ రాసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ సిబ్బంది ఈ విషయాన్ని ఎమ్మెల్సీ అనంత బాబుకు చేరవేయడంతో.. ఆమె అరెస్ట్ కోసమే ఇదంతా చేస్తున్నారని గ్రహించి ఈనెల 29న ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు హైకోర్టులో. బలమైన ఆధారాలు బయటపడడంతోనే ఆమె అరెస్టు తప్పదు అన్న భయంతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మూడున్నర ఏళ్ల కిందట..
2022 మే 19న ఎమ్మెల్సీ అనంత బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని కాకినాడలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు స్వయంగా డోర్ డెలివరీ చేశారు. వైసిపి హయాంలో ఈ కేసును పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. దళిత సంఘాల ఒత్తిడితో హత్య జరిగిన మూడు రోజుల తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే శవ పరీక్షలు 31 గాయాలు, మూడు అంతర్గత గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఒక్క అనంతబాబును మాత్రమే నిందితుడిగా చేర్చారు. అయితే ఒకరిద్దరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. ఒక్కరే హతమార్చి మృతదేహాన్ని కారులో వేసుకొని ఇంటికి తీసుకురావడం అసాధ్యమని.. అందుకే ఈ హత్యలో చాలామంది ప్రమేయం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో అనంత బాబు అరెస్టయ్యారు. అయితే సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంత బాబు పై సస్పెన్షన్ వేటు వేసింది కానీ.. ఆయన జైలు పై విడుదలైన సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే హడావిడి చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మళ్లీ విచారణకు కోరారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎస్డిపిఓ దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. ఇప్పుడు అనంత బాబు భార్య పేరు బయటపడింది. మున్ముందు ఈ కేసులో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.