Srisailam: శివుడు అభిషేక ప్రియుడు. కోరిన వరాలు ఇచ్చే దేవుడు. మనదేశంలో ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఆ క్షేత్రాలలో శివుడికి నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. ఆ క్షేత్రాలకు భక్తులు విశేషంగా వెళ్తుంటారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో పేరు పొందిన శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఇందులో శ్రీశైలం ప్రముఖమైనది. శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తుంటారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా భక్తులు ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడానికి విపరీతంగా వస్తూ ఉంటారు. శ్రీశైలం అనేది ఒక అద్భుతమైన క్షేత్రం. నల్లమల అడవులు, అందులో భ్రమరాంబ సమేతంగా కొలువైన మల్లికార్జునుడు.. దర్శించుకున్న భక్తులకు కొండంత అండగా నిలుస్తుంటాడు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి కి సంబంధించిన అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భక్తులను కాపాడేందుకు మల్లికార్జున స్వామి వివిధ రూపాలలో వచ్చాడని చరిత్ర గాథలు చెబుతున్నాయి. నేటి ఆధునిక కాలంలో కూడా శివుడు తనను నమ్ముకున్న వారికి.. తనకు నిత్యం అభిషేకాలు జరిపే వారికి దర్శనమిస్తున్నాడు. కాకపోతే తన నిజరూపంలో కాకుండా, వేరే రూపంలో దర్శనమిస్తున్నాడు. అటువంటి భాగ్యాన్ని సత్యనారాయణ శాస్త్రి అనే పూజారి పొందారని ఇక్కడి స్థానికులు అంటున్నారు. చిరుత పులి రూపంలో సత్యనారాయణ శాస్త్రి ఇంటికి శివుడు వచ్చాడని.. అంతటి భాగ్యం పొందిన అతని జన్మ సార్థకమైందని స్థానికులు చెబుతున్నారు.
శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల దారిలో సత్యనారాయణ శాస్త్రి ఇల్లు ఉంటుంది. ఇటీవల ఆయన ఇంట్లోకి అర్ధరాత్రి రెండు గంటల 30 నిమిషాల సమయంలో చిరుత పులి వచ్చింది. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ విషయాన్ని ఈ ఓ శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు దృష్టికి సిబ్బంది తీసుకెళ్లడంతో.. వారు వెంటనే భక్తులను అప్రమత్తం చేశారు. ఈ మెట్ల మార్గంలోనే భక్తులు తెల్లవారుజామున పాతాళ గంగలో స్నానాలు చేయడానికి వెళుతుంటారు. పాతాళ గంగ సమీపంలో స్థానికులు ఉండే ప్రాంతాలలో మైకుల ద్వారా ఆలయ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. చిరుత పులి సంచరిస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో కూడా చిరుత పులి సత్యనారాయణ శాస్త్రి ఇంటికి వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ రెండు సందర్భాలలో ఎటువంటి ప్రాణనష్టాన్ని ఆ చిరుత పులి కలిగించలేదు. సత్యనారాయణ శాస్త్రి అపర శివ భక్తుడు. అందువల్లే ఆయన ఇంటికి వచ్చి ఉంటుందని భక్తులు భావిస్తున్నారు. సత్యనారాయణ శాస్త్రి ఇంటికి వచ్చిన చిరుత పులి అటు ఇటు తిరిగి వెళ్లిపోయిందని.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. సత్యనారాయణ శాస్త్రి ఇంటికి వచ్చింది చిరుత పులి కాదని.. ఆ పులి సాక్షాత్తు శివుడి రూపమని స్థానికులు చెబుతున్నారు..