Uddanam: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు, అటవీ జంతువుల సంచారం అధికం. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో వీటి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎలుగుబంట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఇటువంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో మరో వింత జంతువు సంచరిస్తోంది. రాత్రి వేళల్లో గొర్రెలు, మేకలు, పశువుల దూడలపై దాడి చేస్తూ హత మారుస్తోంది. గడిచిన కొద్ది రోజుల్లో పదుల సంఖ్యలో మూగ జీవాలు ఆ వింత జీవి చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయాయి. అయితే అది పులి అని కొందరు అంటున్నారు.. కాదు కాదు చిరుత అని చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం అడవి పిల్లిగా చెబుతున్నారు. రాత్రిపూట ఊరికి దూరంగా ఉన్న పశువులను టార్గెట్ చేస్తోంది ఆ వింత జీవి.ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
* అచ్చం పులి పిల్ల మాదిరిగా
అయితే ఇది అచ్చం పులి పిల్ల మాదిరిగా ఉంది. ఒంటిపై పులిచారలతో కనిపిస్తున్న ఈ జంతువు.. పులి కంటే పొట్టిగా ఉన్నట్లు చూసినవారు చెబుతున్నారు. చాలా చురుగ్గా ఉంటూ కంటికి కనిపించినట్టే కనిపించి మెరుపు వేగంతో మాయమవుతోందని అంటున్నారు. ప్రధానంగా పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఈ వింత జీవి. ముఖ్యంగా గొర్రెల కాపరులకు, పశు పోషకులకు హడలెత్తిస్తోంది.
* ఏటా ఇదే సమయంలో
అయితే ప్రతి ఏటా చలికాలంలో ఈ వింత జంతువు ఉద్దానంలో ప్రవేశిస్తోంది. కానీ నియంత్రించడంలో అటవీశాఖ అధికారులు విఫలమయ్యారు. కేవలం దాని పాదముద్రికల సేకరణకు పరిమితం అవుతున్నారు. ఉద్దానం ప్రాంతంలో దండోరా వేయిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఆనించి ఒడిస్సా వరకు దట్టమైన దండకారణ్యం ఉండేది. మహేంద్రగిరిలో భారీగా విస్తరించేవి. కానీ అడవులు నేలమట్టం అవుతున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. దీంతో అటవీ జంతువులు గ్రామాలపై పడుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఉద్దాన ప్రాంత ప్రజలు కోరుతున్నారు