Kumari Aunty Food Point: ‘కుమారి ఆంటీ’ నేర్పిన పాఠం

ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పోలీసులు కేసు నమోదు చేయడం వాస్తవం.ఆమె వ్యాపారం నిలిచిపోవడం నిజం. ఈ క్రమంలోనే యూట్యూబర్లు క్యాష్ చేసుకోవాలని చూశారు. ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలను తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : January 31, 2024 2:02 pm

Kumari Aunty Food Point

Follow us on

Kumari Aunty Food Point: సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది సెలబ్రిటీలు అయిపోతున్నారు. రాత్రికి రాత్రే ప్రముఖుల జాబితాలో చేరిపోతున్నారు.ఈ కోవలోకి చెందిన వారే కుమారి ఆంటీ. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో ఆమె వ్యాపారం పెరిగింది. కొనుగోలుదారులు పెరిగారు. ట్రాఫిక్ రద్దీ పెరిగింది.దీంతో పోలీసులు కలుగజేసుకోవాల్సి వచ్చింది.ఈ క్రమంలో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. అది కూడా సోషల్ మీడియా వల్లే. ఇంత రచ్చకు అదే కారణం.

ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పోలీసులు కేసు నమోదు చేయడం వాస్తవం.ఆమె వ్యాపారం నిలిచిపోవడం నిజం. ఈ క్రమంలోనే యూట్యూబర్లు క్యాష్ చేసుకోవాలని చూశారు. ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలను తీసుకున్నారు. తనకు ఉన్నది ఈ చిన్నపాటి వ్యాపారమేనని.. సొంత గ్రామంలో జగనన్న ఇచ్చిన ఇల్లు ఒకటి ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అది మొదలు వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. కుమారి ఆంటీ ని బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకొని.. ఆమెకు ఉన్న ఇమేజ్ ను వాడుకోవాలని వైసిపి సోషల్ మీడియా భావించింది. ఈ క్రమంలో ఆ ప్రచారం మరింత పెరిగిపోయింది. చంద్రబాబుకు అనుకూల ప్రభుత్వంతో ఆమె వ్యాపారాన్ని అడ్డుకున్నారని.. జగనన్న కాలనీ ఉందని ఆమె చెప్పడంతోనే ఈ చర్యకు పూనుకున్నారని సోషల్ మీడియాలో ఓ వైసీపీ నేత చేసిన ట్విట్ ఇంత గలాటాకు కారణమైంది.

ఓ చిన్నపాటి హోటల్ యజమానురాలు పై సీఎం స్థాయి వ్యక్తి ఆదేశాలు జారీచేస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ చంద్రబాబు శిష్యుడు రేవంత్. వైసీపీకి వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అందుకే ఈ తరహా ప్రచారమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఆమె స్టాల్ కు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు. గత 14 సంవత్సరాలుగా ఆమె ఇదే వ్యాపారంలో ఉన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆమె వ్యాపారం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వాస్తవం. పోలీసులు కేసు నమోదు చేయడం కూడా నిజం. అయితే ఆమె ఇచ్చిన చిన్నపాటి కంటెంట్ ను తీసుకొని రాజకీయాలను ఆపాదించారు. పెద్ద పెద్ద కథలు అల్లారు. అయితే అదే కుమారి ఆంటీ విషయంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె వ్యాపారానికి అడ్డు చెప్పవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కుమారి ఆంటీ వ్యవహారం ఒక గుణపాఠం నేర్పింది. సోషల్ మీడియా ద్వారా ఎంత లాభమో.. అంత నష్టమని ఈ ఉదంతం చెప్పకనే చెప్పింది.