YCP Party
YCP: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయింది. ఓటమి తరువాత ఇప్పుడిప్పుడే అది బయటపడుతోంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. బయటకు వెళ్ళిపోయారు. ఒకరిద్దరు తప్ప అందరూ సైలెంట్ గానే గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో పెద్దగా అధినేతపై వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు పార్టీలో ఉన్నవారే అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఒకరిద్దరు నేతల తీరుతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఇద్దరు నేతలే కాదు.. చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు వైసీపీలో ప్రచారం నడుస్తోంది.
* వాసుపల్లి గరం గరం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ( vallabhanani Vamsi Mohan) అరెస్టు జరిగింది. ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా మారిపోయారు. ఈ క్రమంలో అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సరిగ్గా ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ మోహన్ తో పాటు కొడాలి నానిని పార్టీ నుంచి బయటకు పంపించేయాలని సూచించారు. మాజీ మంత్రి రోజా మాటలు పొదుపుగా వాడుకోవాలని అన్నారు. విజయసాయిరెడ్డి తీరుతోనే ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.
* ఇరుకున పెడుతున్న కేతిరెడ్డి
ఇటీవల వరుస ఇంటర్వ్యూలో పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( kethi Reddy Venkat Rama Reddy ). చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలతోనే పార్టీకి భారీ డామేజ్ జరిగిందన్నారు. చంద్రబాబు రోధించడంతో సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్నారు. ఈ పరిస్థితి రావడానికి వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని వంటి వారి కారణమని అర్థం వచ్చేలా మాట్లాడారు కేతిరెడ్డి. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. తాజాగా వాసుపల్లి గణేష్ కుమార్ సైతం ఎవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మనకెందుకు అని ప్రశ్నించారు. తద్వారా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్లు సైతం నష్టం చేకూర్చాయని చెప్పుకొచ్చారు.
* మున్ముందు మరింతమంది
అయితే ఇప్పటివరకు పార్టీ నుంచి బయటకు వెళ్లేవారు కామెంట్స్ చేయడం చూసి ఉంటాం. కానీ పార్టీలోనే ఉంటూ ఈ అసంతృప్తి స్వరాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వెలుగు చూస్తుండడం విశేషం. దీనిపై పార్టీలో ఒక రకమైన ఆందోళన ప్రారంభం అయ్యింది. మున్ముందు మరింత మంది నేతలు బాహటంగా మాట్లాడే ఛాన్స్ కనిపిస్తోంది.