Kadambari Jatwani Case : ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో వైసీపీ కీలక నేత చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆ దిశగా ఏపీ పోలీస్ చర్యలు ప్రారంభించిందా? కుక్కల విద్యాసాగర్ అరెస్టు రిమాండ్ లో అదే విషయాన్ని స్పష్టం చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. కుక్కల విద్యాసాగర్ అరెస్టు జరిగింది. అటు తరువాత ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఓసిఐ, మరో ఎస్సైపేరును ప్రస్తావించారు.వారి పేర్లను రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. అయితే ఇదంతా అత్యున్నత ఆదేశాలు ప్రకారం చేశారని చెప్పుకొచ్చారు. అంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అత్యున్నత ఆదేశాలు అంటే.. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జరిగాయి అన్నమాట. అంటే త్వరలో నాటి ప్రభుత్వ ప్రజల్లో ఒకరి పాత్ర బయట పడనుందన్నమాట.
* ముంబై కేసు లింకు
అసలు ఈ కేసు ప్రారంభమైంది ముంబైలో. ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో ముంబై నటి కాదంబరి జెత్వాని ప్రేమాయణం సాగించింది. అది పెళ్లి వరకు వెళ్లేసరికి పారిశ్రామిక వేత్త కుటుంబం నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక.. ఏపీ ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు పారిశ్రామికవేత్త. ఆయనకు నాటి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడం.. మాఫియా తరహాలో ఈ ఘటనకు ముగింపు పలకాలని భావించడం.. అందుకు పోలీసు ఉన్నతాధికారులను వినియోగించుకోవడం జరిగిందన్నది ప్రధాన అనుమానం.
* ఆయన ఒక పావు మాత్రమే
కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత కేవలం పావు మాత్రమే.ముంబై నటి కాదంబరి జెత్వాని తో ఆయనకు పరిచయం ఉంది. దానిని భూ వివాదంగా మార్చి చూపే ప్రయత్నం చేశారు. తరువాత ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. ఆమె క్యారెక్టర్ పై నిందలు వేశారు. చివరకు తప్పుడు కేసుల్లో రిమాండ్ కు పంపారు. వెంటాడి భయపెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ ప్రభుత్వ పెద్దల్లో ఒకరు ప్రత్యక్షంగా పాలుపంచుకోగా..ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కిందిస్థాయి సిబ్బంది పాటించారు.
* ఒక పద్ధతి ప్రకారం
అయితే సదరు పారిశ్రామికవేత్త నాడు ఏపీ కీలక ప్రభుత్వ పెద్దను కలవడం.. ఆయన ఆదేశాలు మేరకు సకల శాఖ మంత్రి రంగంలోకి దిగడం… ఆయన ఆదేశాల మేరకు ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు పావులు కదపడం.. ముంబై నుంచి విజయవాడ తీసుకురావడం వంటివి చకచకా జరిగిపోయాయి. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టయ్యారు. ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. రిమాండ్ రిపోర్టులో సైతం వారి పేరు ప్రస్తావనకు వచ్చింది. దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. ఇక ఉన్నది వైసిపి కీలక నేత అని ప్రచారం సాగుతోంది. అంటే త్వరలో సంచలనం జరగబోతుందన్నమాట.