Job fair in AP: ఏపీకి( Andhra Pradesh) భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏపీని కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో మరో భారీ పెట్టుబడికి లైన్ క్లియర్ అయ్యింది. ఏకంగా రూ.70 వేల కోట్లతో ఓ పరిశ్రమ రాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఉక్కు సదస్సులో ఈ కీలక ప్రకటన చేశారు కేంద్ర సహాయ మంత్రి. ఫ్యాక్టరీ ఏర్పాటు పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఆ రెండు సంస్థలు కలిపి..
అనకాపల్లి జిల్లా( Anakapalli district) నక్కపల్లిలో అర్సెలార్ మిట్టల్, నెప్పం స్టిల్స్ కలిపి భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. రూ. 1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. మొదటి దశలో రూ.70 వేల కోట్లతో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు. ముడి ఖనిజం సరఫరా కోసం ఎన్ఎండిసి తో ఒప్పందం కుదిరింది. నక్కపల్లి మండలం రాజయ్యపేట దగ్గర 2200 ఎకరాల భూమిని కర్మగారం కోసం కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం మొదటి దశలో 20 వేల మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నారు. 60 :40 నిష్పత్తితో ఆ రెండు స్టిల్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. మొదటి దశలో భాగంగా నాలుగేళ్లలో 70 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రతిపాదించారు. 2029 జనవరి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అనుసంధానంగా రెండు పోర్టులు
మరోవైపు రెండో దశలో రూ.80,000 కోట్ల వరకు పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 203 నాటికి పనులు పూర్తి చేయాలని.. తద్వారా మరో 35 వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. 2035 నాటికి నాలుగు వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రమంత్రి ప్రకటనతో త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా పోర్టును కూడా అభివృద్ధి చేయనున్నారు. తద్వారా స్టీల్ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. దాదాపు రూ.6000 కోట్ల రూపాయలతో ఈ పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పోర్టు నిర్మాణానికి 150 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది పూర్తయిన వెంటనే మరో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం సైతం 170 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. దాదాపు 12 బెర్త్ లతో పోర్టు నిర్మాణం జరగనుంది. ఈ పోర్టుల నిర్మాణం ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.