KCR sidelines KTR: తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.. తొలి రోజు సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.. సంతకం పెట్టి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావును నియమించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా కేసీఆర్ అవకాశం కల్పించారు. శాసనమండలిలో భారత రాష్ట్ర సమితి తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.. విప్ గా దేశపతి శ్రీనివాస్ ను నియమించారు. భారత రాష్ట్ర సమితి తరఫున ఫ్లోర్ లీడర్ గా మండలిలో సిరికొండ మధుసూదనాచారి కొనసాగుతారు.
తాజా నియామకాలలో కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ప్రస్తావించలేదు. పార్టీ వ్యవహారాలను కేటీఆర్ నిర్వహిస్తున్నప్పటికీ.. కెసిఆర్ ఆయన పనితీరు పట్ల అంత సుముఖంగా లేరని కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట అంటున్నారు. గులాబీ పార్టీ పెద్దతో సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ కంటే కూడా పార్టీని హరీష్ రావు సమర్థవంతంగా నడిపించగలుగుతారని.. ఈ విషయం కెసిఆర్ కు గతంలో తెలుసని.. పుత్ర ప్రేమ వల్ల ఆయన కొంతకాలంగా పార్టీ పెత్తనం మొత్తం కేటీఆర్ కు అప్పగించారని.. అయితే తన అంచనాలకు మించిన స్థాయిలో కేటీఆర్ పనిచేయలేకపోతున్నారని.. అందువల్లే శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావుకు అవకాశం కల్పించారని ప్రచారం జరుగుతోంది.
హరీష్ రావు ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించిన తర్వాత అసెంబ్లీలో పార్టీ వైఖరిని మరింత బలోపేతం చేస్తుందని గులాబీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. శాసనసభలో వ్యూహాలను అమలు చేయడంలో కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు మెరుగ్గా పనిచేస్తారని ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు కు బాధ్యతలు అప్పగించడం ద్వారా శాసనసభలో పార్టీ పనితీరు మెరుగుపడుతుందని.. బలమైన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి తన పాత్రను పోషిస్తుందని.. గులాబీ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.. ఇటీవల కాలంలో కవిత కూడా పార్టీని హైజాక్ చేసే కుట్ర హరీష్ రావు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఆమె ఆరోపణలకు తగ్గట్టుగానే కేసీఆర్ శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు. ఈ ప్రకారం కేటీఆర్ ను కెసిఆర్ పక్కన పెట్టినట్టేనా? త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత కూడా హరీష్ రావుకు అప్పగిస్తారా? అనే ప్రశ్నలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై గులాబీ నాయకులు ఇంతవరకు పెదవి విప్పలేదు.