Botsa family dominance: విజయనగరం ( Vijayanagaram) అంటేనే ముందుగా గుర్తొచ్చేది బొత్స. అయితే ఆయన కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో పదవులు చేపట్టారు అశోక్ గజపతిరాజు. రాజవంశీయుడైన అశోక్ గజపతిరాజు కేవలం సంప్రదాయ రాజకీయాలను మాత్రమే చేస్తారు. ఎటువంటి హంగు ఆర్భాటం ఉండదు. ఇటువంటి సమయంలో జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి నాయకుడిగా ఎదిగారు బొత్స. ఇప్పటి రాజకీయాలకు తగ్గట్టు అడుగులు వేశారు. కులముద్ర చాటుకొని బలమైన నాయకుడిగా ఎదిగారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవిని సైతం అలంకరిస్తారని ప్రచారం నడిచింది. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స పేరు ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆపై బీసీ నేతగా గుర్తింపు పొందారు. అయితే రోశయ్యతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అందుకోవడంతో.. దానికి సమానమైన పదవిగా ఉండే ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొత్స ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుంది అనేది విజయనగరంలో ఉండదు.. అంతలా సాగింది బొత్స హవా. అయితే ఇప్పుడు అశోక్ గజపతిరాజు గవర్నర్ పదవికి వెళ్లిపోవడంతో.. బొత్స హవాకు బ్రేకులు వేసే విధంగా మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగినట్లు స్పష్టమౌతోంది.
భారీ వ్యూహం..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియామకం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టిడిపి నాయకత్వం ఎవరికీ అప్పగించినా బొత్సపై దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు లేవు. అంతలా ఉండేది ఆ కుటుంబ ప్రాబల్యం. అశోక్ గజపతిరాజు క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకోవాల్సిన రావడంతో ఇప్పుడు హై కమాండ్ ఆ జిల్లా పై దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో బొత్స కుటుంబ హవాకు బ్రేక్ వేయాలన్నది లోకేష్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే కిమిడి నాగార్జునకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికీ ఆయన డిసిసిబి చైర్మన్గా నియమితులయ్యారు. ఇప్పుడు టిడిపి అధ్యక్షుడిగా రెండోసారి ఆయననే భర్తీ చేశారు. ప్రోటోకాల్ ప్రకారం డిసిసిబి పదవి ఉంటేనే ఆయన జిల్లా కేంద్రంలో చక్రం తిప్పగలరని లోకేష్ ఆలోచన. ఇకనుంచి బొత్స కు ధీటుగా నాగార్జున రాజకీయాలు ఉండనున్నాయి. ఎప్పటికీ ఆయన బొత్సతో ఢీ అంటే డి అంటూ ఢీకొడుతున్నారు.
కిమిడి కుటుంబ వారసుడు..
మాజీ మంత్రి కిమిడి మృణాళిని( Kimidi Mrunalini) కుమారుడే నాగార్జున. ఆయన తండ్రి కిమిడి గణపతి రావు కూడా ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆపై కళా వెంకట్రావుకు స్వయాన తమ్ముడి కుమారుడే నాగార్జున. 2014లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణ పై గెలిచారు కిమిడి మృణాళిని. ఆ దఫా మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో మృణాళిని తప్పుకొని తన కుమారుడికి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన నాగార్జున బొత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. అయినా సరే ఐదేళ్లపాటు చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపించారు. 2020లో టిడిపి జిల్లా పగ్గాలు అందుకున్నారు నాగార్జున. 2024 ఎన్నికల్లో పోటీకి అన్ని విధాలా సిద్ధంగా ఉండగా పెదనాన్న కళా వెంకట్రావు కోసం సీటు వదులుకోవాల్సి వచ్చింది. అయితే కూటమి అధికారంలోకి రావడంతో డిసిసిబి అధ్యక్ష పదవి ఆయనకు ఇచ్చారు. ఆపై జిల్లా పార్టీ పగ్గాలు మరోసారి అందించడం విశేషం. రాష్ట్రంలో ఇలా రెండోసారి అధ్యక్ష పదవి ఇచ్చిన దాఖలాలు ఏ జిల్లాలో కూడా లేవు.
పూర్తిగా స్వేచ్ఛ..
జిల్లా టిడిపి వ్యవహారాల్లో కిమిడి నాగార్జునకు( Nagarjuna) చంద్రబాబు లోకేష్ ఫుల్ స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా బొత్స ఫ్యామిలీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గొద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిసిసిబిని తన ఆధీనంలోకి తీసుకున్నారు నాగార్జున. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా బొత్స సత్యనారాయణ డిసిసిబి నుంచి తన రాజకీయాలు నడిపేవారు. చివరకు విజయనగరం అమ్మవారి సినిమాను సైతం డిసిసిబి కార్యాలయ భవనం మేడపై నుంచి తిలకించేవారు. కానీ ఈసారి డిసిసిబి పై ఎటువంటి రాజకీయ ముద్ర పడకూడదు అని బొత్సకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు నాగార్జున. మొత్తానికి అయితే విజయనగరం జిల్లాలో నాగార్జున ద్వారా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు, లోకేష్. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.