https://oktelugu.com/

Jagan Helipad: జగన్ ఇంట్లో హెలిపాడ్ కోసం 9 కోట్ల ఖర్చు? ప్రచారంలో నిజం ఎంత?

గత ఐదేళ్లలో జగన్ దుబారా ఖర్చును ప్రజల ముందు పెట్టే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ. తాజాగా జగన్ నివాసంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ ఖర్చును బయట పెట్టింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 20, 2024 / 04:07 PM IST

    Jagan Helipad

    Follow us on

    Jagan Helipad: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా ముందుకు సాగుతోంది చంద్రబాబు సర్కార్. కానీ నిధుల సమీకరణ దృష్ట్యా సంక్షేమ పథకాలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తోంది. ఈ తరుణంలో గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతోంది కూటమి. దీనిని డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణిస్తోంది వైసిపి. పాలన చేతకాక.. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక.. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని వైసిపి మండిపడుతోంది. కానీ కూటమి పార్టీల నేతలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వైసిపి హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టే క్రమంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు కూటమి నేతలు. అప్పట్లో నిధుల దుర్వినియోగం జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజాగా జగన్ తన హయాంలో హెలిప్యాడ్ నిర్మాణానికి దాదాపు రూ.8.6 కోట్ల మేర.. సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం చేసినట్లు టిడిపి నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇవే వైరల్ అవుతున్నాయి.

    * ప్రజాదర్బార్లలో ఫిర్యాదులు
    వైసీపీ హయాంలో భారీగా అవినీతి జరిగిందన్నది కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. సీఎం నుంచి దిగువ స్థాయి నేత వరకు అవినీతిలో భాగం పంచుకున్నారని చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. గత ఐదేళ్లుగా వైసీపీ నేతల దందాతో ఇబ్బంది పడ్డామని పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగంతో పాటు.. ప్రభుత్వ నిధులు సంతానికి వాడుకున్నారని.. జల్సా లకు, విలాసాలకు ఖర్చు చేశారన్నది టిడిపి నుంచి వచ్చిన ఆరోపణ. అయితే ప్రతి నెల ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలను బయటపెడుతోంది టిడిపి.

    * భారీ స్థాయిలో ఖర్చు
    జగన్ తాడేపల్లి లో నిర్మించిన ఇంటికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 13 కోట్ల రూపాయలతో కంచె నిర్మించారన్నది టిడిపి నేతలు చేసిన ఆరోపణ. ఇంట్లో వినియోగిస్తున్న ఫర్నిచర్ పై సైతం వివాదం నడుస్తోంది. జగన్ భద్రతపై సైతం అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. తాజాగా తన ఇంటి ఆవరణలో హెలిప్యాడ్ నిర్మాణం పై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై తాజాగా టిడిపి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. అందులో జగన్ హెలిప్యాడ్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు గురించి వివరించింది. సాధారణంగా హెలిప్యాడ్ కోసం 20 లక్షల రూపాయలకు కూడా ఖర్చు కాదని.. కానీ జగన్ హయాంలో నిర్మాణం కోసం ఏకంగా రూ.8.60 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. దీంతో ఇది వైరల్ అంశంగా మారిపోయింది. నిరుపేద ముఖ్యమంత్రి అంటూ జగన్ అప్పట్లో ప్రచారం చేసుకున్నారు. కేవలం నెలకు రూపాయి మాత్రమే వేతనంగా తీసుకున్నట్లు చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు అదే ప్రతిబంధకంగా మారింది. టిడిపి ఒక్కో అవినీతిని బయటపెట్టే పనిలో ఉంది. దీనిపై వైసీపీ నేతలు ఏమంటారో చూడాలి.