Plastic in cow’s stomach : పశువులను విచ్చలవిడిగా విడిచి పెట్టే పెంపకందారులకు హెచ్చరిక. తప్పకుండా అటువంటి ఆవులు ప్రమాదానికి గురికావడం ఖాయం. సాధారణంగా పట్టణాలు, నగరాల్లో ఆవులను విడిచి పెడతారు. పాలు పితికి రోడ్లు మీద వదిలేస్తారు. ఆవులు వ్యర్ధాలు తింటూ సంచరిస్తుంటాయి. అయితే ఇప్పుడు వ్యర్ధాలలో ప్రమాదకరమైన ప్లాస్టిక్ సైతం ఉంటుంది. ప్రతి వస్తువు వినియోగంలో ప్లాస్టిక్ దర్శనమిస్తోంది. వ్యర్ధాల రూపంలో ప్లాస్టిక్ తింటున్న పశువులు ప్రమాదానికి గురవుతున్నాయి. అనారోగ్యం బారిన పడుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అయితే ఓ ఆవు పొట్ట నుంచి 70 కిలోల ప్లాస్టిక్ బయటపడింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆవుకు శస్త్ర చికిత్స చేశారు. కడుపులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను బయటకు తీశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 కిలోల ప్లాస్టిక్ బయటపడడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. శస్త్ర చికిత్స చేసి అతి కష్టం మీద ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీయాల్సి వచ్చిందని పశువైద్యనిపుణులు చెబుతున్నారు.
* ఎమ్మిగనూరులో వెలుగు చూసిన ఘటన
ఎమ్మిగనూరులో ఓ ఆవు ఆయాస పడుతూ కనిపించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీనిని గమనించారు లాయర్ తిమ్మప్ప. వెంటనే ఆవు దుస్థితిని పశు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పశు వైద్య సహాయ సంచాలకుడు సుబ్రహ్మణ్యేశ్వరాచారి, పశు వైద్యులు నరేంద్ర నాథ్ రెడ్డి, వీరేష్, రవితేజ అవును పరీక్షించారు. పొట్టలో ప్లాస్టిక్ పేరుకుపోయిందని నిర్ధారించారు. బుధవారం ఆపరేషన్ చేసి 70 కిలోల ప్లాస్టిక్ ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
* నిషేధం విధించినా
సాధారణంగా పట్టణాలు, నగరాల్లో పశువుల సంచారం అధికం. దీనిపై మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా చాలాసార్లు ఆదేశాలు ఇచ్చింది. పారిశుద్ధ్యం క్షీణించడానికి పశువుల సంచారమే కారణమన్న నివేదికలు ఉన్నాయి. కానీ ఏ నగరంలోనూ, ఈ పట్టణంలోనూ చూసిన పశువులే కనిపిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది.
* ప్లాస్టిక్ పై నిషేధం ఏది
ఏపీలో ప్లాస్టిక్ వినియోగం కూడా అధికంగా ఉంది. ఒక్క పశువు కడుపులోనే 70 కిలోల ప్లాస్టిక్ లభ్యమయిందంటే.. ఏ స్థాయిలో ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారో అర్థమవుతోంది. ప్లాస్టిక్ నిషేధం అన్నది పేపర్ రాతలకు మాత్రమే పరిమితం అవుతోంది. దానిని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది.