Chips Packet: చిన్న పిల్లలను ఆకర్షించడానికి.. వారి ఏడుపును మాన్పించడానికి చిప్స్ ప్యాకెట్స్ హెల్ప్అవుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి ఇవి ప్రాణాలను కూడా తీస్తాయని ఇటీవల జరిగిన సంఘటనలను భట్టి తెలుస్తోంది. మార్కెట్లో వివిధ బ్రాండ్ల పేర్లతో చిప్స్, స్నాక్స్ ప్యాకెట్లు పిల్లలను ఆకర్షించేందుకు రంగురంగుల ప్యాకింగ్‌తో పాటు చిన్న ప్లాస్టిక్ బొమ్మలను కూడా ఉంచుతున్నాయి. అయితే ఈ బొమ్మల కారణంగా ఇటీవల ఓ చిన్నారి ప్రాణం పోయింది. దీంతో పిల్లలకు చిప్స్ కొనుగోలు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఇవి ఎలా ప్రమాదకరం అంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఐదేళ్ల బాలుడు ఫర్హాన్ చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తింటుండగా అందులో ఉన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మను నోట్లో పెట్టుకున్నట్లు సమాచారం. ఆ బొమ్మ ప్రమాదవశాత్తూ గొంతులో ఇరుక్కుపోవడంతో బాలుడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
చిన్నపిల్లలకు వస్తువులను నోట్లో పెట్టుకునే అలవాటు సహజం. ముఖ్యంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు పిల్లలు బొమ్మలు, నాణేలు, చిన్న వస్తువులను నోట్లో పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిప్స్ ప్యాకెట్లలో ఇచ్చే చిన్న ప్లాస్టిక్ బొమ్మలు, ఉంగరాలు, బంతులు లేదా ఇతర ఆకర్షణీయ వస్తువులు పిల్లల చేతికి సులభంగా చేరుతాయి. అవి పొరపాటున గొంతులో ఇరుక్కుపోతే ఊపిరాడక ప్రాణాపాయం ఏర్పడుతుంది.
పిల్లల కోసం స్నాక్స్ కొనుగోలు చేసే సమయంలో తల్లిదండ్రులు ప్యాకెట్‌పై ఉన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న బొమ్మలు లేదా విడి భాగాలు ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు. బొమ్మలను ఉపయోగించే సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి అని చెబుతున్నారు.
ఏదైనా వస్తువు గొంతులో ఇరుక్కుపోతే పిల్లలు అకస్మాత్తుగా దగ్గడం, మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, ముఖం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం అందించాలి. పిల్లలను ఆకర్షించే ఉత్పత్తుల్లో చిన్న ప్లాస్టిక్ వస్తువులను ఉంచే విషయంలో తయారీ సంస్థలు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని బాలల హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకరమైన చిన్న వస్తువులపై స్పష్టమైన హెచ్చరికలు ముద్రించడం, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం అవసరమని సూచిస్తున్నారు.
ఫర్హాన్ మృతి ఒక కుటుంబానికే కాదు సమాజానికే హెచ్చరికగా నిలిచింది. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలు, బొమ్మల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి విషాదాలను చాలావరకు నివారించవచ్చు. పిల్లల భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
