Avakai Amaravati Festival: ఏపీలో( Andhra Pradesh) పర్యాటక అభివృద్ధికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను సమప్రధాన్యం తీసుకొని అభివృద్ధి చేస్తోంది. ఇందుకుగాను రకరకాల పేర్లతో కార్యక్రమాలను రూపొందిస్తోంది. అందులో భాగంగా ఆవకాయ అమరావతి పేరుతో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరపనుంది. విజయవాడ వేదికగా జరగనున్న ఈ వేడుకలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా విజయవాడలో పర్యాటక రంగానికి సంబంధించి భవానీ ద్వీపం, పున్నమి ఘాట్ లు ఉన్నాయి. అయితే ఆ రెండు వేదికల వద్ద ఇప్పుడు పర్యాటక రంగానికి సంబంధించి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవకాయ అమరావతి సంక్రాంతిలో భాగంగా ప్రత్యేక ఫెస్టివల్ గా నిలవనుంది.
అభివృద్ధిలో విశాఖ కీలకం..
పర్యాటక రంగం( tourism) అంటే ముందుగా గుర్తొచ్చేది విశాఖపట్నం. సువిశాల తీర ప్రాంతం ఈ నగర సొంతం. దేశంలోనే టూరిజం పరంగా ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ నగరం. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కైలాసగిరిలో దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జి ఏర్పాటు చేసింది. డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. నగరంలో పర్యటించే పర్యాటకుల కోసం ఆర్టీసీలో రాయితీ ప్రయాణానికి సంబంధించి పాసులు కూడా ఇచ్చింది. దాదాపు విశాఖ తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. మరోవైపు విశాఖ తో పాటు మన్యం, తిరుపతిలో పర్యాటకుల కోసం అద్దె ఇళ్లను సైతం అందుబాటులో ఉంచింది.
విజయవాడకు ప్రాధాన్యం..
అయితే ఒక్క విశాఖలోనే కాదు విజయవాడకు( Vijayawada) అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం. దానికి కారణం అమరావతికి దగ్గరగా ఉండడం. రాజధాని ప్రాంతం కావడంతో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం అందించాలని చూస్తోంది. ముఖ్యంగా పున్నమి ఘాట్ ను ప్రధాన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని భావిస్తాంది. భవానీ ద్వీపం సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది విజయవాడ నగరానికి. అయితే ప్రస్తుతం అమరావతిలో సైతం పర్యాటకానికి పెద్ద పీట వేస్తోంది. సాధారణంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేటప్పుడు.. కేవలం రాజధాని పనుల నిమిత్తం వెళ్లేవారు కాదు. అక్కడ చూడదగ్గ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ప్రత్యేకంగా వెళ్లిన వారు సైతం ఉండేవారు. అందుకే ఇప్పుడు అమరావతి తో పాటు విజయవాడ ను అదే కోవలో చూడబోతోంది. అందుకే విజయవాడ కేంద్రంగా ఇప్పుడు ఆవకాయ అమరావతి అనే పేరుతో భారీ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.