TDP Janasena Alliance: ఏపీ రాజకీయాల్లో 2023 కీలక మలుపులకు భూమిక వహించింది. సరికొత్త రాజకీయాలకు దారి చూపించింది. అటు అధికార పక్షానికి, ఇటు విపక్షాలకు చేదు అనుభవం మిగిల్చింది. 2019 తర్వాత.. 2020, 2021, 2022 సాఫీగా ముగిసినా.. 2023లో మాత్రం రాజకీయాలు హీట్ పుట్టించాయి. ముఖ్యంగా సీఎం జగన్ కు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు బాగా గుర్తుండిపోతుంది ఈ సంవత్సరం. జగన్ హవాకు ఈ ఏడాది ప్రారంభంలో చెక్ పడింది. అటు చంద్రబాబు అరెస్టుతో ఏడాది చివర్లో చుక్కెదురు అయ్యింది. ఎలా చూసుకున్నా వీరిద్దరికీ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది.
* ఎమ్మెల్సీ ఎన్నికలతో వైసిపికి కౌంట్ డౌన్..
ఈ ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపికి షాక్ తగిలింది. అప్పటివరకు అన్ని ఎన్నికల్లో గెలిచిన వైసీపీకి చేదు ఫలితాలు ప్రారంభమయ్యాయి. మూడు ప్రాంతాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి, తూర్పు రాయలసీమ స్థానం నుంచి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా పట్టభద్రులు మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. అప్పటివరకు విజయాల కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీలో విశ్వాసాన్ని నింపాయి. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి ఒక రకమైన కలవరం ప్రారంభమైంది అప్పటినుంచే. రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
* భారీ కుదుపు..
ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమె గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి. కానీ టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీలోకి విరాయించడంతో ఆ పార్టీ బలం 19కి పడిపోయింది. కానీ తెలుగుదేశం అభ్యర్థికి వైసీపీ నుంచి నలుగురు ఓటు వేశారు. దీంతో నెల్లూరు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణం చూపుతూ పార్టీ నుంచి వేటు వేశారు. టిడిపి సంచలన విజయంతో సంబరాల్లో మునిగిపోగా.. వైసీపీలో మాత్రం ఒక రకమైన సంక్షోభం కనిపించింది.ఈ ఏడాది రాజకీయాల్లో ఇదో కీలక ఘటనగా మారింది.
* ఫైట్ పిక్ స్టేజ్ కు..
రాష్ట్ర విభజనకు ముందే చంద్రబాబు జగన్ మధ్య వైరం తారా స్థాయిలో ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ముఖాముఖిగా తలపడాల్సి వచ్చింది. ఈ ఇద్దరు నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో సైతం వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు. 2014లో బిజెపితో కలిసి నడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2019లో మాత్రం ఆ పార్టీకి దూరమయ్యారు. జగన్ ఎత్తుగడలో చిక్కుకొని కష్టాలు తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ 2023లో ఇది కాస్త పతాక స్థాయికి చేరింది.నాలుగు దశాబ్దాల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఏనాడు జైలు జీవితం ఎదురు కాలేదు. కానీ జగన్ చంద్రబాబును 52 రోజులు పాటు జైలులో గడిపేలా పావులు కదిపారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. దాని ద్వారా టిడిపిని మానసికంగా దెబ్బతీశారు. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
* పొడిచిన పొత్తు
చంద్రబాబుపై అవినీతి కేసుల పుణ్యమా అని టిడిపి, జనసేన మధ్య పొత్తు ముందుగానే కుదిరింది. ఎప్పుడో సంక్రాంతి తర్వాత పొత్తుల ప్రకటన చేద్దామని అటు చంద్రబాబు, ఇటు పవన్ ఆలోచన చేశారు. కానీ చంద్రబాబు అరెస్టుతో పవన్ సడన్ ఎంట్రీ ఇచ్చారు. వెంటనే పొత్తు ప్రకటించారు. సంచలనానికి తెర తీశారు.ఆ రెండు పార్టీల పొత్తు ముందుగానే కూయడానికి జగనే కారణం. ఈ ఏడాదిలో జనసేన ను నిలువరించి ప్రయత్నం చేయడంతో టిడిపి తో పొత్తు పెట్టుకోవాలని పవన్ భావించారు.
* పవన్ కు కలిసి వచ్చిన కాలం..
ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన జనసేన కార్యక్రమాలను ప్రభుత్వం నిలువరిస్తూ వచ్చింది. ముఖ్యంగా పవన్ యాత్రపై ఆంక్షలు విధించాలని చూసింది. చివరికి పవన్ వాహనంపై కూడా విమర్శనాస్త్రాలు సంధించింది. మిలటరీ వాహనాన్ని పోలినట్టుగా ఉందని.. అది నిబంధనలకు విరుద్ధమని వైసీపీ నేతలు విమర్శించే దాకా పరిస్థితి వచ్చింది. ఏపీలో వారాహి యాత్ర ఎలా చేపడుతారో చూస్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు. కానీ పవన్ అదే పట్టుదలతో వారాహి యాత్ర సక్సెస్ ఫుల్ గా చేపట్టారు. మంత్రులు, సీఎంపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ఈ ఏడాది జనసేనకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బలమైన రాజకీయ పక్షంగా ఎదిగేందుకు ఈ ఏడాది ఎంతగానో దోహద పడింది. తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడం ద్వారా సీట్లు పెంచుకునేందుకు ఈ ఏడాది బీజం వేసింది.
* మారిన సమీకరణలు..
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న మార్పు జగన్ ను కలవర పెట్టింది. మరోవైపు సొంత పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చికాకు తెప్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో తన బొమ్మను చూసి ఓటు వేశారని చెప్పుకొచ్చిన జగన్… ఇప్పుడు మాట మార్చారు. తన బొమ్మతో పాటు మీ బొమ్మ బాగుండాలని ఎమ్మెల్యేలను హితబోధ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగులను మార్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే 11 మందిని మార్చి మార్పు అనివార్యమని సంకేతాలు పంపారు. మొత్తానికైతే 2023 అధికారపక్షం తో పాటు విపక్షాలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో.. 2024లో సైతం అసలు సిసలు రాజకీయం జరగనుంది. ఫలితాలను తేల్చనుంది. ఏపీకి విజేత ఎవరో తేలనుంది.