AP Roads: ఏపీలో కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణం పై దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. మొత్తం 274 రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో రహదారులను బాగు చేస్తూ వచ్చింది. గత ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున రోడ్ల మరమ్మతులు చేపట్టింది. ఇప్పుడు మరోసారి బాగు చేసేందుకు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
పాడైన రహదారులు..
ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా బలహీనపడ్డాయి. భారీగా గోతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలకు ఇబ్బందికర ప్రయాణాలు తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాడైన 274 రోడ్లను గుర్తించింది ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసేందుకు వీలుగా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అంతర్ రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులను అభివృద్ధి చేయనుంది. 108 రాష్ట్రస్థాయి రహదారుల కోసం రూ.400 కోట్లు, 166 జిల్లా రహదారుల కోసం రూ.600 కోట్లు కేటాయించారు. ఈ మేరకు ఆర్ అండ్ బి శాఖ ఈరోజు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.
వైసీపీ హయాంలో విమర్శలు..
ఏపీ వ్యాప్తంగా గత వైసిపి ప్రభుత్వంలో రోడ్లపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అయింది. ఏళ్ల తరబడి రోడ్ల మరమ్మత్తులు జరగకపోవడంతో రహదారులు గోతులమయంగా మారాయి. అప్పట్లో ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో విపక్షంలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. సామాన్య జనం సైతం సోషల్ మీడియాలో రహదారుల పరిస్థితులను ఎండగట్టారు. మొన్నటి ఎన్నికల్లో రహదారులు ప్రధానంగా ప్రభావం చూపాయి. అయితే తాము అధికారంలోకి వస్తే రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రాధాన్యత క్రమంలో రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల రూపాయలతో రహదారుల రూపురేఖలను మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.