Heavy Rains in AP: ఏపీకి( Andhra Pradesh) మరోసారి భారీ వర్ష సూచన. కొద్ది రోజులుగా తెరిపినిచ్చిన వర్షాలు.. మళ్లీ ప్రారంభం కానున్నాయి. అయితే పగటిపూట ఎండలు.. రాత్రిపూట వర్షాలు ఇటీవల సాధారణంగా మారాయి. అయితే వర్షాలతో నదుల్లో నీటి ప్రవాహం భారీగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఆ మధ్యన ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళంలో వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదనదులు రికార్డు స్థాయిలో ప్రవహించాయి. ఎక్కడికక్కడే ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తరుణంలో గత రెండు రోజులుగా వాతావరణం భిన్న పరిస్థితుల్లో కనిపించింది. రాత్రిపూట వర్షం పడుతుండగా.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ స్థాయిలో ఎండలు మండాయి. కానీ ఇప్పుడు మళ్లీ వర్ష సూచన వచ్చింది ఏపీకి.
పిడుగుల అలర్ట్..
ఏపీలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు( heavy rain) నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రధానంగా పిడుగుల హెచ్చరిక జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం జిల్లాలో నిన్ననే పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మెలియాపుట్టి మండలం లోని వారిలో పని చేస్తున్న కార్మికులపై పిడుగులు పడ్డాయి. అయితే ఈ ఘటనతో శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన నెలకొంది. నెల రోజుల వ్యవధిలోనే పిడుగుపాటుకు పదిమందికి పైగా చనిపోయారు. మరోసారి పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు రావడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు పిడుగులతోపాటు వర్షం హెచ్చరికలు ఉన్నాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.
అన్ని ప్రాంతాలకు భారీ హెచ్చరికలు..
అయితే కోనసీమ( Konaseema) , అనకాపల్లి, విశాఖ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ కావడం విశేషం. అయితే ఇదంతా ఉపరితల ద్రోణి ప్రభావంతోనే అని వాతావరణ శాఖ చెబుతోంది. మరో మూడు రోజులపాటు వీటి ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు తీరం వెంబడి భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. అయితే గత రెండు నెలలుగా వరుసగా అల్పపీడనాలతో మత్స్యకారులు ఉపాధికి దూరమయ్యారు. ఇప్పుడు తాజా హెచ్చరికలతో ఆందోళనకు గురవుతున్నారు.