Malla Ramgopal Naidu: శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam district) చెందిన ఆర్మీ మేజర్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. దేశానికి సేవ చేసిన ఆయన ధైర్య సాహసాలకు గుర్తింపుగా రూ.1.25 కోట్ల నగదు బహుమతి ఇవ్వనుంది. దేశానికి సేవ చేసిన ఆయన ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ బహుమతి లభించింది. 2023లో జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ మేయర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు. తన ప్రాణాలను పణంగా పెట్టి తోటి సైనికులను రక్షించిన ఆయన వీరత్వానికి ఈ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారాన్ని అందించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ భారీ నజరానాను ప్రకటించింది.
* స్వస్థలం శ్రీకాకుళం..
మల్లా రామ్ గోపాల్ నాయుడు( malla ramgopal Naidu ) స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలం నగిరి పెంట. ఇండియన్ ఆర్మీలో చేరి అంచలంచెలుగా మేజర్ స్థాయికి చేరుకున్నారు. 2023 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద జరిగిన పోరాటంలో రామ్ గోపాల్ నాయుడు తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తన తోటి సైనికుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చూపిన వీరత్వం, ధైర్య సాహసాలకు గాను కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్ గా ప్రశంసలు అందుకున్నారు.
* ఏం జరిగిందంటే?
జమ్ములోని( Jammu Kashmir) కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం వచ్చింది. రామ్ గోపాల్ నాయుడు తన సహచర సైనికులతో కలిసి సోదాలు చేపట్టారు. స్థానికుల ఇళ్లలో దాక్కున్న ఐదుగురు ఉగ్రవాదులు సైనికులను చూడగానే కాల్పులు ప్రారంభించారు. రామ్ గోపాల్ నాయుడు ఎంతో ధైర్యంగా, ఏమాత్రం వెనుకాడకుండా ముందుకు దూకి ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఒక ఉగ్రవాది తప్పించుకొని పారిపోయాడు. ఈ నేపథ్యంలో మిగిలిన ఐదో ఉగ్రవాది రాంగోపాల్ బృందంపై గ్రేనేడ్ విసిరాడు. రామ్ గోపాల్ నాయుడు చాకచక్యంగా వ్యవహరించి తన బృందాన్ని దాని నుంచి తప్పించాడు. ఆ ఉగ్రవాదిని కూడా మట్టుపెట్టి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాడు. తన తోటి సైనికులను రక్షించుకుంటూనే శత్రువులను మట్టుపెట్టిన నాయుడికి కీర్తి చక్ర అవార్డును ప్రకటించారు.
* ప్రత్యేక ఉత్తర్వులు..
తాజాగా ఏపీ ప్రభుత్వం రామ్ గోపాల్ నాయుడుకు రూ 1.25 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 2024లో మేజర్ రామ్ గోపాల్ నాయుడుకు కేంద్రం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దానిని సగర్వంగా చెప్పుకొని భారీ నగదు పారితోషికాన్ని సిక్కోలు ఆర్మీ మేజర్ కు ప్రకటించింది.