AP Liquor Policy: మాట తప్పను..మడమ తిప్పను అంటూ చెప్పుకొచ్చిన ఏపీ సీఎం జగన్ మడత పేచీ వేశారు. మాట తప్పారు.. మడమ కూడా తప్పేశారు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నది నోటి మాటే తప్ప.. ఆచరణ సాధ్యం కాదని తేల్చేశారు. దశల వారీ నిషేధం ఉత్త మాటే అని.. అందులో ఏ మాత్రం నిజం లేదని తన చర్యల ద్వారా నిరూపించారు. దేవుడు దయతలచి మన ప్రభుత్వం ఏర్పాటైతే అక్క చెల్లెమ్మల బాధల నుంచి విముక్తి చేస్తాను. మాయదారి మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాను. మద్యం, సారా అన్నది లేకుండా చేస్తానంటూ జగన్ తెగ బిల్డప్ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ద్రుష్ట్యా ఏటా 25 శాతం మద్యం షాపులను తగ్గిస్తానని.. నాలుగేళ్లలో మద్య నిషేధం వైపు అడుగులేస్తానని చెప్పడంతో..ఓహో నిజమే కదా అని అంతా సర్దుకున్నారు.ప్రైవేటు మద్యం షాపులు ఎత్తివేసి ప్రభుత్వమే నడపడంతో కొంత నమ్మకం పెట్టుకున్నారు. మద్యం ధరలు పెంచితే ఆటోమెటిక్ గా మందుబాబులు మద్యానికి దూరమవుతారని కూడా చెప్పుకొచ్చారు. జగన్ బాబు మంచి లైన్ తీసుకున్నారని మెచ్చుకున్నారు. మొదటి సంవత్సరం చెప్పినట్టే 25 శాతం షాపులు తగ్గించడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని సంతోషించారు. రెండో సంవత్సరం 13 శాతం షాపులను మాత్రమే తగ్గించి.. కొవిడ్ ను కారణంగా చూపారు. పోనిలే మరేం చేస్తామంటూ ప్రజలు అర్ధం చేసుకున్నారు. మూడో సంవత్సరం మాత్రం ఎందుకో జగన్ బాబు షాపుల జోలికి పోలేదు. దీంతో ప్రజలు అనుమానాల్లో పెరిగాయి. ఇంతలో భవిష్యత్ మద్యం ఆదాయంపై అప్పులు తేవడం ప్రారంభించడంతో అనుమానాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఏకంగా మూడేళ్ల కాలని కొత్త బార్ పాలసీ విడుదల చేయడంతో సంపూర్ణ మద్య నిషేధం లేనట్టేనని తేలింది. ఏపీ ప్రజలకు పిక్చర్ మొత్తం అర్ధమైంది. ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకూ సీఎం జగన్ చెప్పిన మాటలన్నీ ఉత్త బుర్రకధేనని తేలిపోయింది.
బార్లకు కొత్త పాలసీ
ఏపీ సర్కారు శుక్రవారం కొత్త బార్ పాలసీని విడుదల చేసింది. ప్రస్తుత పాలసీ ఈ నెలాఖరుతో ముగుస్తుండగా, పాలసీని 2 నెలలపాటు పొడిగించింది. అయితే సెప్టెంబరు 1 నుంచి వచ్చే పాలసీ నిబంధన లు విడుదల చేసింది. కొత్త పాలసీలో ఇచ్చే లైసెన్సుల గడువు మూడేళ్లపాటు ఉంటుందని, ఏటా 10శాతం లైసెన్సు ఫీజు పెరుగుతుందని వివరించింది. కొత్త పాలసీ నిబంధనల్లో ఎక్కడా నిషేధం అనే మాటను ప్రస్తావించలేదు. పైగా తమ ప్రభుత్వం మద్య నియంత్రణకు కట్టుబడి ఉందని, అందుకోసం 840 బార్ల సం ఖ్యను పెంచడం లేదని చెప్పుకొచ్చింది. అసలు ఉన్న వాటిని తగ్గించడం గురించి ప్రస్తావించకుండా, పెంచకపోవడమే గొప్ప మేలు అన్నట్టుగా కితాబిచ్చుకోవడం గమనార్హం. కాగా కొత్త పాలసీలో బార్లను వేలం పద్ధతి ద్వారా కేటాయించనున్నట్లు తెలిపింది. కొత్త పాలసీలో వివిధ రకాల ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రూ.384 కోట్ల ఆదాయం సమకూరనుంది.
Also Read: Secundrabad Incident: సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు.. పక్కా ప్లాన్‌తోనే జరిగిందా!?
వేర్వేరుగా వేలం..
ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌కు, మున్సిపాలిటీకి, నగర పంచాయతీకి వేర్వేరుగా వేలం నిర్వహిస్తారు. 50వేల లోపు జనా భా ఉన్న ప్రాంతాల్లో బార్లకు 15లక్షల నాన్ రిఫండబు ల్ ఫీజు, రూ.5లక్షలు లైసెన్సు ఫీజు చెల్లించాలి. 50వేల నుంచి 5లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 35లక్షలు నాన్ రిఫండబుల్ రిజిస్ర్టేషన్ ఫీజు, రూ.5లక్షలు లైసెన్సు ఫీజు ఉంటుంది. 5లక్షల జనాభా దాటిన ప్రాంతాల్లో రూ.50లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు, రూ. 5లక్షలు లైసెన్సు ఫీజు ఉంటుంది. ఆయా కేటగిరీల్లో నాన్ రిఫండబుల్ ఫీజుపై కనీసం రూ.2లక్షలు తగ్గకుండా వేలంలో కోట్ చేయాలి. వారిలో అత్యధికంగా కోట్ చేసిన వారిని గుర్తించి బార్ కేటాయిస్తారు. ఆ తర్వాత అత్యధికంలో కనీసం 90శాతం కోట్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకుని తర్వాత బార్లు కేటాయిస్తారు. ఒకవేళ ఒక బార్‌కు ఒకే ధరను ఎక్కువ మంది కోట్ చేస్తే అక్కడ లాటరీ ద్వారా లైసెన్సీని ఎంపిక చేస్తారు.
కొత్త ప్రాంతాలకు విస్తరణ
మొత్తం బార్ల సంఖ్యను పెంచకుండా ఈసారి కొత్త ప్రాంతాలకు కూడా బార్లు కేటాయించనున్నట్లు ఎక్సైజ్ శాఖ పాలసీలో తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్లో బార్ కేటాయిస్తే కార్పొరేషన్‌కు 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా బార్ ఏర్పాటుచేసుకోవచ్చని తెలిపింది. మున్సిపాలిటీ అయితే 2కిలోమీటర్ల పరిధి వరకూ ఏర్పాటుచేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు ఫీజులనూ భారీగా పెంచుతున్నట్లు తెలిపింది. మూడు కేటగిరీల్లో వరుసగా రూ.10లక్షలు, రూ.7.5లక్షలు, రూ.5లక్షలుగా దరఖాస్తు రుసుము ఉంటుందని వివరించింది. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని, వేలం కూడా ఆన్లైన్లో ఉంటుందని తెలిపింది. 3 స్టార్ హోటళ్లు, ఆ పైన హోటళ్లకు లైసెన్సు ఫీజు రూ.5లక్షలు, నాన్ రిఫండబుల్ రిజిస్ర్టేషన్ ఫీజు రూ.50లక్షలు ఉంటుందని తెలిపింది.
పెంచలేదని ‘మెలిక’
సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని ప్రభుత్వం తొలినుంచీ చెబుతూ వస్తోంది. అందులో భాగంగానే రెం డు విడతల్లో మద్యం షాపుల సంఖ్య తగ్గించినట్టు చెప్పుకొంది. ఆ క్రమంలోనే 2019లో బార్ పాలసీ ఇచ్చినప్పుడు 840 బార్లకు గాను 487 బార్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా సంఖ్య తగ్గిస్తున్నట్లు అప్పట్లో గొప్పగా ప్రకటించుకుంది. కానీ కోర్టు ఆదేశాలతో అప్పట్లో పాలసీ ముందుకు సాగలేదు. తీరా ఇప్పుడు ఇచ్చిన పాలసీలో మళ్లీ 840 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. మద్య నిషేధం చేసే ఆలోచనే ఉంటే 2019లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బార్ల సంఖ్యను భారీగా కుదించాలి. కానీ మద్య నియంత్రణలో భాగం గా బార్ల సంఖ్య పెంచబోవడం లేదంటూ అర్థరహితమైన వివరణ ఇచ్చింది. గతంలో 2017 పాలసీ సమయంలో ప్రభుత్వానికి దరఖాస్తులు ఫీజులు, లైసెన్సు ఫీజుల ద్వారా రూ.284 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పాలసీలో రూ.384 కోట్లు వస్తుందని అంచనా వేసుకుంది. నాన్ రిజిస్ర్టేషన్ ఫీజులను ఎక్సైజ్ భారీగా పెంచింది. ప్రస్తుత పాలసీ ప్రకారం లైసెన్సు, ఇతర అన్ని ఫీజులు కలిపి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.10లక్షలు, రూ.20లక్షలు, రూ.30లక్షలుగా ఉంటే… అవి వరుసగా రూ.20లక్షలు, రూ.40లక్షలు, రూ.55లక్షలు కనీసం కానున్నాయి. వాటిపై దరఖాస్తుదారులు ఎంత అదనంగా కోట్ చేస్తే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది.
తొలిసారి వేలం
తొలిసారి వేలం ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం తొలిసారి బార్లకు వేలం నిర్వహిస్తోంది. గతంలో ప్రైవేటు షాపులు ఉన్నప్పుడు మద్యం షాపులకు వేలం నిర్వహించేవారు. కానీ బార్లకు లాటరీ తప్ప వేలం విధానం పెట్టలేదు. బార్ పెట్టుబడి ఎక్కువ కావడంతో దీనిలో పోటీతత్వం ఇప్పటివరకూ లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం దీన్ని కూడా వదలకుండా అదనపు ఆదాయం కోసం వేలం నిర్వహిస్తోంది. వేలంలో కూడా అత్యధిక బిడ్డర్‌కు ఆ తర్వాత అందులో 90శాతం కోట్‌చేసిన వారికి మధ్య లింకు పెట్టి వీలైనంత రాబడి పొందాలని ప్రణాళిక రూపొందించింది.
Also Read: BJP vs Congress: మోడీ, షా, అద్వానీ విచారణ ఎదుర్కొన్నారు కదా.. సోనియా, రాహుల్ లకు ఎందుకంత లొల్లి..?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Andhra pradesh switches liquor policy from prohibition to restriction
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com