YCP: రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. గెలిస్తే తన ఇష్టారాజ్యంగా పాలిస్తామంటే కుదరదు. ప్రజల్లో ఒక రకమైన భయాందోళన సృష్టించి, ఏవేవో అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది తగదు. అధికారంలో ఉన్నప్పుడు సమర్ధించి.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని వ్యతిరేకిస్తాము అంటే కుదరదు. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు కూడా. ఒక రాజకీయ నాయకుడిగా పాటించాల్సిన కనీస విలువలు, ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస విశ్వసనీయత లేకుండా వైసీపీ రాజకీయం నడిపింది. ఇప్పుడు కూడా అలానే నడపాలని చూస్తోంది. ప్రత్యర్థి పార్టీల నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే 15 ఏళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టు కనిపిస్తోంది ఆ పార్టీ. తాను చేస్తే నీతి, ప్రత్యర్థి చేస్తే బూతు అన్నట్టు వైసిపి రాజకీయం చేస్తోంది.
* ఎక్కువగా తిరస్కరణ..
15 ఏళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రస్థానంలో.. ఒక ఐదేళ్లు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మిగిలిన కాలంలో ఏపీ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. అయితే దానిపై ఎంత మాత్రం ఆలోచన చేయడం లేదు. బూతు మాటలతో, కవ్వింపు చర్యలతో వైసిపి 2.0 కోసం కలలు కంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేదో తాను సుపరిపాలన అందించానని.. తన హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో జరిగిన ఘటనలు గుర్తు చేసుకుంటే ఆ పార్టీకి నిద్ర పట్టదు. అయితే తాము చేసిన దాని గురించి పట్టించుకునే స్థితిలో ఉండదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అలా చేసుకుంటే ఆ పార్టీ పాతాళంలోకి వెళుతుంది. అంతలా అప్పట్లో తప్పులు జరిగాయి. కానీ అంతా సవ్యంగా జరిగింది అన్నట్టు ఇప్పటి ప్రభుత్వంపై అదే తరహా పోరాటం చేస్తున్నారు వైసీపీ నేతలు.
* నాటి ఘటనలు మరిచిపోయారా?
పల్నాడులో బోండా ఉమామహేశ్వరరావు కారుపై జరిగిన దాడి ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఇనప రాడ్లతో దాడి చేశారు అప్పట్లో. దానిని ప్రోత్సహించింది అప్పటి వైసిపి పాలకులు కాదా? అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దండయాత్ర చేశారు. కర్రలతో దాడికి దిగారు. అందులో తప్పేముంది అని ప్రశ్నించి జగన్ సమర్థించుకున్నారు. అప్పటి వైసీపీ నేతలు గంట అరగంట భాగోతాలు, అనంతబాబు డోర్ డెలివరీ అరాచకాలు, గోరంట్ల మాధవ్ విశ్వరూపాలు ఆస్వాదించిన జగన్ ఇప్పుడు అరవ శ్రీధర్ విషయంలో విలువలు అంటూ ఉపన్యాసాలు చేస్తున్నారు. తాను చేస్తే నీతి.. ఎదుటివాడు చేస్తే బూతు అన్నట్టు హంగామా చేస్తున్నారు. నాడు చంద్రబాబు అరెస్టు సక్రమం అన్నారు. ఇప్పుడు మాత్రం అరెస్టులు చేస్తే అక్రమం అంటున్నారు. అయితే జనాలు అన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోతున్నారు. తమదైన మార్కు రాజకీయంతో ముందుకు వెళుతున్నారు. ప్రజల ఆలోచన గతి తప్పితే మాత్రం పాచిక పారుతుంది. లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత పతన స్థితికి చేరుకుంటుంది. ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంది.