Telangana transport : తెలంగాణ ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త పద్ధతి అమలులోకి తెచ్చింది. ఇటు వాహనదారులకు, అటు రవాణా అధికారులకు ఇద్దరికీ మేలు జరిగేలా నూతన విధానం శనివారం(జనవరి 24) నుంచి అమలులోకి వచ్చింది. వాహనం కొన్న చోటే రిజిస్ట్రేషన్ చేసే విధానం ప్రవేశపెట్టింది. మాదాపూర్ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో రాష్ట్రమంతా అమలులోకి తెచ్చింది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే ఇకపై ఆర్డీవో కార్యాలయాల్లో క్యూలు, చక్కరలు అవసరం లేదు. డీలర్లు ఫొటోలు, డాక్యుమెంట్లు ఆన్లైన్లో సమర్పించి నంబర్ కేటాయిస్తారు.
నూతన ప్రక్రియ ఇలా..
డీలర్లు ఇన్వాయిస్, బీమా, చిరునామా ధ్రువీకరణ, వాహన చిత్రాలు అప్లోడ్ చేస్తారు. అధికారులు డిజిటల్ పరిశీలన తర్వాత ఆమోదం ఇస్తారు. ఆర్సీ కార్డు చిరునామాకు పోస్ట్ అవుతుంది. అవసరమైతే షోరూమ్‌లో తనిఖీ జరుగుతుంది. అయితే కొత్త విధానం ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు మాత్రమే. వాణిజ్య వాహనాలు ఆర్డీవోలోనే చేసుకోవాలి.
ప్రయోజనాలు ఇవీ..
ఆర్టీవోలో స్లాట్ బుకింగ్, వేచి ఉండటం ముగిసిపోతుంది. కొనుగోలు రోజు సాయంత్రానికి రిజిస్ట్రేషన్ పూర్తి. పట్టణ ప్రజలకు మార్గదర్శకం. డిజిటల్ పారదర్శకత పెరుగుతుంది, అక్రమాలు, బ్రోకర్ వ్యవస్థ తగ్గుతుంది. ఈ వ్యవస్థ వాహన డీలర్లను బలోపేతం చేస్తుంది. వినియోగదారుల అనుభవం మెరుగవుతుంది. రాష్ట్రవ్యాప్త అమలుతో ట్రాఫిక్, కార్యాచరణ సమస్యలు తగ్గుతాయి.