Actor Darshan: సినిమాలు వేరు.. నిజ జీవితం వేరు. సినిమాల్లో సూపర్ స్టార్లుగా వెలుగొందిన హీరోలు నిజ జీవితంలో కూడా అలా ఉంటామంటే కుదరదు. తమ కండలు తిరిగిన దేహంతో.. ఎదుటివారిని తొక్కేస్తాం.. ఎదురుపడితే చంపేస్తామంటే అస్సలు కుదరదు. ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో సూపర్ స్టార్ల మాదిరిగానే సామాన్య ప్రజలకు కూడా హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ విషయాన్ని సూపర్ స్టార్లు ఒప్పుకోరు.
కర్ణాటకలో దర్శన్ అనే ఒక నటుడు ఉన్నాడు. ఇతడికి మాస్ పబ్లిక్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అప్పట్లో ఇతడు నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో దర్శన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పైగా అతడు వేసే వేషాలు మొత్తం హీరోచితంగా ఉంటాయి కాబట్టి చాలామంది అతడిని ఆకాశానికి ఎత్తేశారు.. దీంతో దర్శన్ ఆకాశంలోనే ఉండిపోయాడు. ఇదే సమయంలో కొంతమంది వ్యక్తులతో కలిసి రేణుక స్వామి అనే తన అభిమానిని అతడు అంతం చేశాడు.
మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దర్శన్.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. రేణుకా స్వామి ని అంతం చేసిన తర్వాత.. సీసీ కెమెరాలలో ఆ విజువల్స్ మొత్తం రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ మధ్య జైలు సిబ్బందికి నజరానాలు అందించి సకల సౌకర్యాలు ఉండేలా చూసుకున్నట్టు తెలుస్తోంది. జైల్లో ఉండుకుంటూ ఫోన్ కూడా మాట్లాడినట్టు సమాచారం.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేశాయి.. అయితే ఇప్పుడు దర్శన్ ఒక్కసారిగా మాట మార్చాడు. అంతేకాదు జైల్లో తనకు ఎదురవుతున్న అనుభవాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చాడు.
ప్రస్తుతం అతడు శిక్ష అనుభవిస్తున్న జైల్లో సరైన సౌకర్యాలు లేవట. చలికి తట్టుకోలేకపోతున్నాడట. జైలు అధికారులు ఇచ్చిన దుప్పటి చలి నుంచి అతడిని రక్షించలేకపోతుందట. చలి తీవ్రతకు తట్టుకోలేక అతడు ఇబ్బంది పడుతున్నాడట. అందువల్లే తనకు ఇంకొక దుప్పటి ఇవ్వాలని కోరినప్పటికీ జైలు అధికారులు పట్టించుకోవడం లేదట. చివరికి తన ఇంటి నుంచి కుటుంబ సభ్యులు మరొక దుప్పటి పంపించినప్పటికీ జైలు అధికారులు వాడకుండా ఆంక్షలు విధిస్తున్నారట.. ఇదే విషయాన్ని అతడు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అయితే దీనిపై కర్ణాటక కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనేది ఇంతవరకు తెలియ రాలేదు.. ఇన్ని రోజులపాటు సూపర్ స్టార్ గా వెలుగు వెలిగిన దర్శన్ కు ఇటువంటి దుస్థితి రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమౌతోంది.