Pooja: చాలామంది పూజలో ఉపయోగించే వస్తువులను స్వచ్ఛంగా ఉంచాలని కోరుకుంటారు. నీరు, పూలు, పండ్లు, ఆహార పదార్థాలు ఇలా ఏవైనా ఇతరులు ముట్టనిది, ఎవరు వాడనిది దేవునికి సమర్పించాలని అనుకుంటారు. అయితే వాస్తవానికి మనం దైవానికి సమర్పించే ఈ పదార్థాలు ఇతరులు ముట్ట లేదా? నిజంగానే ఇవి ఎంగిలి కానివేనా? అన్న సందేహం కొందరికి వస్తుంది. అసలు మనం దేవునికి వస్తువులను ఎలా ఇస్తే పరిశుద్ధంగా ఉంటాయి?
హిందూ పురాణాల ప్రకారం దేవుళ్లకు నిష్ఠతో పూజలు చేయడం వల్ల దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. ఒక దేవుడికి పూజ చేసే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిష్టగా ఉండాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఆ తర్వాత పూజ చేసే సమయంలో దేవుడికి అభిషేకం చేయాల్సివస్తే ఆ నీటిని భావించి లేదా బోరు నుంచి ఎవరు వాడకుండా తీసుకువచ్చి అభిషేకం చేస్తారు. అలాగే ఎవరు వాడని.. ఎవరు ఉపయోగించని పూలను దేవుడికి సమర్పిస్తారు. పండ్లు, ఆహార పదార్థాల విషయంలోనూ అంతే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు.
వాస్తవానికి ఇవి ఇప్పటికే ఎంగిలి అయి ఉంటాయి. మనం బావి నుంచి తీసుకువచ్చే నీరు బావిలో కప్పలు లేదా చేపలు అప్పటికే వాటిని ఎంగిలి చేసి ఉంటాయి. పూలు కోయకముందే వాటిపై తుమ్మెదలు వాలి ఉంటాయి. పండ్లు కూడా ఇతర జీవులు వాటిపై వాలి ఉంటాయి. మరి వీటిని సమర్పించడం వల్ల దేవుడు ఎందుకు సంతోషిస్తున్నాడు? ఇలా చేయడం వల్ల ఎందుకు ఆగ్రహించడం లేదు?
ఒక దేవునికి ఏదైనా పదార్థాన్ని సమర్పించేటప్పుడు నిర్మలమైన మనసుతో ఇవ్వడం వల్ల ఆ వస్తువు లేదా ఆ పదార్థం పరిశుద్ధంగా మారుతుంది. అంటే వస్తువు ఎంగిలి అయిందని భావించడం కంటే మనం ఎంత పరిశుద్ధంగా.. ఎంతటి నిర్మలమైన మనసుతో దేవుడికి సమర్పిస్తున్నాము అన్నది ప్రధానం అని కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కకావికరమైన మనసుతో ఎంత పరిశుద్ధమైన పదార్థాలను సమర్పించినా.. అవి వృధానే అని అంటున్నారు. దేవుళ్లకు సమర్పించే సమయంలో నిష్టతో అంటే నిర్మలమైన మనసుతో.. ఎటువంటి అలజడి లేకుండా.. ఎవరిపై పరుష వాక్యాలు చేయకుండా.. ఎవరిని నిందించకుండా.. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటూ నచ్చిన ఒక్కరోజు అయినా భక్తితో దేవుళ్లకు సమర్పించే ఏ ఆహార పదార్థం అయినా పరిశుద్ధంగా మారుతుందని అంటున్నారు.
భక్తితో చేసే ఏ పని అయినా పరమేశ్వరుడికి ఇష్టమే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కన్నప్ప చరిత్ర ఉదాహరణ. తన రెండు కన్నులను తీసి శివుడికి సమర్పించినప్పుడు అది మాంసాహారం అవుతుంది. అయినా కూడా పరమశివుడు కన్నప్ప భక్తిని మెచ్చుకుంటాడు. అంటే ఇక్కడ కన్నప్పలో కేవలం భక్తిని మాత్రమే చూశాడు. అలాగే మనుషులు కూడా తమ భక్తితో ధర్మబద్ధమైన ఏ పనులైనా దేవుళ్లకు ఇష్టమే అని అంటున్నారు.