YCP: ఏపీలో( Andhra Pradesh) టీడీపీ కూటమి పాలన 17 నెలలు పూర్తవుతోంది. ఇంకా ప్రభుత్వానికి 43 నెలల సమయం ఉంది. మూడు పార్టీలు ఉమ్మడిగానే ముందుకు సాగుతున్నాయి. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి నిరభ్యంతరంగా కొనసాగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్రంలో బిజెపి పెద్దలు సైతం ఏపీకి సహకారం అందిస్తున్నారు. రాజకీయంగా అండదండలు అందిస్తూ వస్తున్నారు. ఏపీలో సజావుగా పాలన ముందుకు సాగుతోంది. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అంతా సజావుగా ఉన్న తరుణంలో టిడిపిలో ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. వాటిని పరిష్కరించుకుంటేనే మేలు. లేకుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అనుభవాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదిలోనే నియంత్రించగలిగితేనే వాటికి అడ్డుకట్ట వేయవచ్చు.
* పార్టీపై పూర్తిస్థాయి పట్టు..
తెలుగుదేశం ( Telugu Desam)పార్టీపై పూర్తి పట్టు సాధించారు లోకేష్. చంద్రబాబు పాలనపై పూర్తిగా దృష్టి పెట్టడం వెనుక లోకేష్ కృషి ఉంది. లోకేష్ పార్టీని లీడ్ చేసుకోవడం వల్లే చంద్రబాబు నిశ్చింతగా ఉంటున్నారు. అయినా సరే ఎక్కడికి అక్కడే విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం ఏ స్థాయిలో వివాదానికి దారితీసిందో తెలిసిందే. అలాగే నెల్లూరు జిల్లాలో కావ్య కృష్ణారెడ్డి వివాదం కూడా తెలిసిన విషయమే. ఈ ఘటనలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు కూడా. పార్టీ బలం లేకుండా సొంత బలంతో గెలిచాం అనుకున్న వారు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళిపోవచ్చు అని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మంగళగిరి ప్రజా దర్బార్ కు వేలాది మంది తరలి రావడం.. పార్టీ ఆదేశించిన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు విస్మరించడం పై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు క్రమశిక్షణ కమిటీ పనితీరును సైతం తప్పు పట్టారు. ఒకే సమయంలో తండ్రి చంద్రబాబు, కుమారుడు లోకేష్ పార్టీలో వ్యవహారాలపై రియాక్ట్ అయ్యారు అంటే ఏ స్థాయిలో వారికి సమాచారం అంది ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
* జగన్ హయాంలో అలా..
జగన్( Y S Jagan Mohan Reddy ) హయాంలో ఇదే మాదిరిగా వ్యవహారాలు నడిచాయి. ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు పరిస్థితి ఉండేది. కొన్ని జిల్లాల్లో మంత్రులతో ఎమ్మెల్యేలు విభేదించేవారు. ఎక్కడికక్కడే విభేదాలు బయటపడ్డాయి. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా తీసుకున్నారు. తనను చూసి అంతా సర్దుబాటు అవుతుందని భావించారు. తానే ఫైనల్ అన్నట్టు వ్యవహరించి ఆ వ్యవహారాలను చూసి చూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానాలు చాలా జిల్లాల్లో వికటించాయి. పార్టీలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించకపోవడంతో అవి రోజురోజుకు ఎక్కువయ్యాయి. 2024 ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం చూపాయి. దీనికి తోడు ఎన్నికలకు ముందు ఏకంగా నియోజకవర్గాలనే మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. అవి కూడా విభేదాలకు కారణం అయ్యాయి. చాలా జిల్లాల్లో నేతలు బహిరంగంగానే తిట్టుకునేవారు. అయినా పట్టించుకునే వారు కాదు జగన్మోహన్ రెడ్డి. కొన్ని జిల్లాల్లో అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
* నిఘా వ్యవస్థ ఏర్పాటు..
తెలుగుదేశం పార్టీలో పరిస్థితి కట్టు దాటుతుందని గ్రహించారు లోకేష్( Nara Lokesh). అందుకే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలో విభేదాలను అప్పటికప్పుడు పరిష్కరించేందుకు.. నాయకత్వం దృష్టి కి తీసుకొచ్చేందుకు త్రిశభ్య కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విభేదాలను పరిష్కరించేందుకు బలమైన వ్యవస్థ అవసరమని ఆలోచన చేస్తున్నారు. చాలామంది సీనియర్లు ఈ విభేదాలపై తేలిగ్గా ఉంటే మూల్యం తప్పదని హెచ్చరించడంతో రంగంలోకి దిగారు నారా లోకేష్. అందుకే నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో నిఘా వర్గాల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇకనుంచి 13 ఉమ్మడి జిల్లాల్లో పార్టీలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పసిగట్టే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.